శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం 15న మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఎన్నికలు హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చోరీ సొత్తు బాధితురాలికి అప్పగింత పిల్లి దుర్గాప్రసాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వాయిదా

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి పలువురు భక్తులు గురువారం విరాళం అందించారు. విజయవాడకు చెందిన అలార తిరుమల గోదావర్తి గోపాలకృష్ణమాచార్యులు ● వనజ దంపతులు రూ.లక్ష అందజేశారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఏపీఎంఈయూ) సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్‌ఎంసీ) శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక ఈ నెల 15వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు యూనియన్‌ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి, ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న పి.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఎస్‌ఎంసీలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో వైద్య ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని నాగరాజు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారన్నారు. ఎన్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న యూనియన్‌ సభ్యులందరూ ఈ ఎన్నికల పక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఎన్నికల సహాయ అధికారిగా శ్రీనివాసరావు వ్యవహరించనున్నట్లు తెలిపారు.

సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన ఏపీఎస్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి 2000 బ్యాచ్‌కు చెందిన సభ్యులు రూ.3,82,000 ఆర్థిక సాయం అందించారు. వివరాలు.. మహమ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ విజయవాడ ఏపీఎస్‌పీఎఫ్‌ గార్డ్స్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ గత నెల 31న మరణించారు. ఆయనకు భార్యతో పాటు ఎంబీబీఎస్‌ చదువుతున్న కుమారుడు, ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కుమార్తె ఉన్నారు. వారికి తమ వంతుగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘2000 బ్యాచ్‌ రియల్‌ హెల్పింగ్‌ గ్రూప్‌’ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. విజయవాడలోని ఏపీఎస్‌పీఎఫ్‌ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఖాజా కుటుంబానికి విజయవాడ జోన్‌ కమాండెంట్‌ ముద్దాడ శంకరరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ హేమసుందర్‌, 2000 బ్యాచ్‌ గ్రూప్‌ సభ్యులు ఆర్థిక సాయాన్ని అందజేశారు.

కంచికచర్ల: ఓ వృద్ధురాలి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో కంచికచర్ల పోలీసులు ఆ కేసును ఛేదించి బంగారు ఆభరణాలను రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. విజయవాడ రూరల్‌ డీసీపీ బి.లక్ష్మీనారాయణ గురువారం విలేకరులకు వివరాలు తెలిపారు. కంచికచర్లకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు మొగల్‌ జరీనా తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోందని, ఆమె ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారుగొలుసు(10గ్రాములు), బంగారు ఉంగరం(4గ్రాములు), రూ.20వేల నగదు మొత్తం రూ.1.40 లక్షల విలువ గల సొమ్మును దొంగిలించారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, విచారణలో కంచికచర్లకు చెందిన వేముల మునీంద్ర చోరీ చేసినట్టుగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారన్నారు. రికవరీ చేసిన సొత్తును బాధితురాలు మొగల్‌ జరీనాకు పంచాయతీ మధ్యవర్తుల సమక్షంలో అప్పగించామని తెలిపారు. త్వరితగతిన చోరీ కేసును ఛేదించిన ఎస్‌ఐ శంకరరావు, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో సీఐ వైవీఎల్‌ నాయుడు, ఎస్‌ఐ శంకరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

విజయవాడలీగల్‌: దాదాపు రెండు దశాబ్దాల క్రితం విజయవాడలో సంచలనం సృష్టించిన వి.దుర్గాప్రసాద్‌ అలియాస్‌ పిల్లి దుర్గాప్రసాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి గురువారం 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది. రిటైర్డ్‌ డీఎస్పీ రత్నరాజు, మరో ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో సెక్షన్లు మార్చి విచారణ జరపాలని డిఫెన్స్‌ న్యాయవాదులు వేసిన పిటీషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పాత సెక్షన్ల ప్రకారమే అభియోగాలు నమోదు చేసేందుకు న్యాయమూర్తి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement