బాబ్ గోల్డెన్ గోల్ స్కీమ్‌లో గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీ
పటమట(విజయవాడతూర్పు): బ్యాంక్ ఆఫ్ బరోడా తన ప్రత్యేక 555 రోజుల ’బాబ్ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’పై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు బ్యాంక్ రీజనల్ హెడ్ కిరణ్‌కుమార్ రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ గురువారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 12, 2026 నుంచి అమల్లోకి వచ్చాయని, ఈ పథకం ద్వారా సాధారణ ఖాతాదారులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నాన్–కాల్ చేయగల డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీ అందుబాటులో ఉందన్నారు. ఈ పథకం రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఖాతాదారులకు మెరుగైన వడ్డీ రాబడులు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను పెంచినట్లు తెలిపారు. సురక్షితమైన, స్థిరమైన రాబడిని కోరుకునే ఖాతాదారులకు ఈ పథకం మంచి అవకాశమని పేర్కొన్నారు. డిపాజిటర్లకు పోటీ వడ్డీ రేట్లను అందిస్తూనే, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలకు బ్యాంకు నిరంతరం మద్దతు ఇస్తోందని తెలిపారు. మధ్యకాలిక పెట్టుబడులపై స్థిరమైన, భరోసా కలిగిన రాబడిని కోరుకునే ఖాతాదారులకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఖాతాదారులు బ్యాంకు శాఖలతో పాటు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్, బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రారంభించవచ్చని తెలిపారు.
గన్నవరం రూరల్: మండలంలోని సావరగూడెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి అవార్డుకు నామినేట్ అయ్యింది. దీనిలో భాగంగా గురువారం కేంద్ర బృందం గ్రామంలో పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు అనురాధ, సంపాబసు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేసిన కార్యక్రమాల రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, క్షేత్ర స్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీపీవో ధనలక్ష్మి, మల్లేశ్వరి, ప్రణవి, సునీత శర్మ, డెప్యూటీ ఎంపీడీవో కిరణ్మయి, కార్యదర్శి పంగిడయ్య తదితరులు పాల్గొన్నారు.
చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసిన నిందితునికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్ గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బండిపాలెం గ్రామానికి చెందిన బండి హరి అదే గ్రామానికి చెందిన పొందూరి సాయి వెంకట గోపి మధ్య కొంతకాలంగా పాత కక్షలున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి హరి తన ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా సాయి వెంకట గోపి కొడవలితో ఒక్కసారిగా దాడి చేయటంతో హరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గోపిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


