వేలాదిగా తరలిరానున్న భక్తులు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం జరిగే నాగులచవితి పర్వదినానికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ డీసీ శ్రీరామవరప్రసాదరావు వెల్లడించారు. ఆయన గురువారం సాయంత్రం ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వేల సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా కోనేరు వద్ద వస్తువులు భద్రపరుచుకునే గది(క్లోక్ రూమ్), పాదరక్షల స్టాండ్, లడ్డు, పులిహోర ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారానే నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.
ముస్తాబైన ఆలయం
ప్రసిద్ధ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత నాగులచవితి పర్వదిన వేడుకలు అత్యంత ప్రధానమైనవి. ఆలయ ప్రాంగణం వెలుపల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వివిధ పుష్పాలతో స్వామి వారి మండపం, నాగపుట్ట, ఆలయం ఆవరణ అంతా అలంకరించారు.


