చోడవరం నాగేంద్రస్వామి ఆలయం ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

చోడవరం నాగేంద్రస్వామి ఆలయం ముస్తాబు

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

చోడవరం నాగేంద్రస్వామి ఆలయం ముస్తాబు

● రేపు నాగుల చవితి మహోత్సవం

● భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

● ఉత్సవాలకు బస్సులు నడపనున్న ఆర్టీసీ

పెనమలూరు: కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చోడవరం గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీనాగేంద్రస్వామి ఆలయం నాగుల చవితి వేడుకలకు ముస్తాబైంది. ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం వేకువజాము నుంచి నాగులచవితి ప్రారంభమవుతుంది. ఈ పండుగకు ఉమ్మడి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చోడవరం ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఆలయ ధర్మకర్తలు, దాతలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

నాగుల చవితికి ఏర్పాట్లు

నాగుల చవితిని పురస్కరించుకుని స్వయంభూగా వెలిసిన స్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి ప్రత్యేకంగా బారికేడ్లు, షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు పుట్టలో పోసేందుకు దాతల సాయంతో ఉచితంగా ఆవుపాలు అందజేస్తారు. పలువురు దాతల సాయంతో మంచినీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ, పులిహోర భక్తులకు అందించనున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన జరుగుతుంది.

ప్రత్యేక పూజా కార్యక్రమాలు

నాగులచవితి పండుగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం ధర్మకర్త, ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటసత్య శ్రీమన్నారాయణ చార్యులు, వేదాంతం సాయి భార్గవ్‌ తెలిపారు. శుక్రవారం వేకువజాము మూడు గంటల నుంచి మంగళ వాయుద్యాలుతో శ్రీలక్ష్మీ నారాయణసహిత నాగేంద్రస్వామికి విశేష పూజలు, అలంకరణ, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయి భక్త బృందంతో భజన, 11 గంటలకు శ్రీవేణుగోపాలస్వామి భక్త సమాజంతో సంకీర్తన, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నాగుల చవితి పండుగ సందర్భంగా ఆర్టీసీ చోడవరానికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. శుక్రవారం వేకువ జాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రత్యేక బస్సులు విజయవాడ మార్కెట్‌, బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌, పెనమలూరు సెంటర్‌ నుంచి దేవస్థానం వరకు నడుస్తాయి. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement