మచిలీపట్నంఅర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) కృష్ణా జిల్లా కమిటీ బుధవారం జిల్లా పంచాయతీ రాజ్ అధికారి ధనలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వి.కె.మూర్తి మాట్లాడుతూ.. 90 శాతం వైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయిస్తున్నారని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పోలింగ్ ముగిసిన అనంతరం సిబ్బంది స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని, మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర, సమంజసమైన కారణాలతో విధుల మినహాయింపు కోరే ఉపాధ్యాయుల దరఖాస్తులను హెచ్‌ఎంలు, ఎంఈఓలు ఉన్నతాధికారులకు పంపించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. మచిలీపట్నం మునిసిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ విధుల్లో పీఓలు, ఏపీఓలుగా పనిచేసిన 17 మంది ఉపాధ్యాయులకు 15 రోజులు గడిచినా రెమ్యూనరేషన్ చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. రిజర్వ్ సిబ్బందిగా ఉండి విధులు కేటా యించకుండా వెనక్కి పంపిన ఉపాధ్యాయులకు శిక్షణ, పంపిణీ కేంద్రానికి హాజరైనందుకు పారి తోషికం ఇవ్వాలని కోరారు. పోలింగ్ అనంతరం ఓపీఓలు రిసీవింగ్ కేంద్రానికి తప్పనిసరిగా రావాలా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని, ఎన్నికల సిబ్బందికి రోజుకు రూ.500 చొప్పున భోజన, అల్పాహార సదుపాయం కల్పించాలని కోరారు. ప్రిసైడింగ్ అధికారులకు చెల్లించాల్సిన రూ.2 వేలకు బదులుగా కొన్ని చోట్ల రూ.1,600 మాత్రమే ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి కొణతం మాధవరావు, రాష్ట్ర కౌన్సిలర్ కె.సతీష్‌బాబు, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.కిరణ్‌బాబు, ఎం.వీరబాబు, జిల్లా కార్యదర్శి టి.వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.


