అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ దాడి చంద్రశేఖర్ కథనం మేరకు.. విజయవాడ అయోధ్యనగర్‌లోని చేవూరు వారి వీధికి చెందిన ఇదిచిల్లి వెంకటరావు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తుంటారు. గత ఏడాదిలో తన భార్య చనిపోవడంతో ఆయన ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. గవర్నర్‌పేటలో నివసిస్తున్న అతని కుమార్తె శిరీష అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటారు. రోజూ సాయంత్రం డ్యూటీకి వెళ్లే వెంకటరావు మరుసటి రోజు ఉదయం తిరిగి ఇంటికి వస్తుంటాడు. ఈ నెల ఎనిమిదో తేదీన డ్యూటీకి వెళ్లిన ఆయన మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలకొట్టి, లోపల అంతా చిందరవందరగా కనిపించింది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా పగలకొట్టి కనిపించాయి. బీరువాలో ఉంచిన రూ.11 వేల నగదు, రెండు ఉంగరాలు కనిపించలేదు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. న్యూ రాజరాజేశ్వరీపేట రైల్వేట్రాక్ పక్కన ఆంజనేయ స్వామి గుడి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన రెడ్డిమల్లి ఆశీష్(27)ను అదుపులోకి తీసుకొని విచారించగా, బెట్టింగులకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్టు అంగీకరించాడు. ఇదిచిల్లి వెంకటరావు ఇంట్లో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి బుధవారం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.


