కోనేరుసెంటర్(మచిలీపట్నం): విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏఎస్పీ నాయుడు మాట్లాడుతూ.. అబుల్‌కలాం ఆజాద్ స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించటంతో పాటు దేశంలో విద్యారంగ అభివృద్ధికి ఎనలేని పాటు పడ్డారన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం సాధ్యపడు తుందని విశ్వసించిన ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, మతసామరస్యం విద్యావికాసం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


