19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు 20న జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల 26 మంది జెడ్పీటీసీ సభ్యుల చేతుల్లో జెడ్పీ పీఠం కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు ఏర్పాట్లు
చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలో స్థానిక సంస్థల పదవుల భర్తీపై రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది.
19న ఎంపీపీలు.. 20న జెడ్పీ చైర్మన్
జిల్లాలోని 26 మండల పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు ఈ నెల 19న ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మరుసటి రోజు 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14వ తేదీలోగా నోటీసులు జారీ చేయనున్నారు.
26 మంది జెడ్పీటీసీ సభ్యులే నిర్ణేతలు
జిల్లా పరిషత్ పునర్విభజన అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికలు కావడంతో 26 మంది జెడ్పీటీసీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. చేతులెత్తే విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను ఆయా సభ్యులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశాలకు ఆహ్వానాలు పంపనున్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపికలో ఆయా మండలాల రాజకీయ సమీకరణలు కీలకం కానుండగా, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం ప్రభావం చూపనుంది. సీల్డ్ కవర్ ద్వారా అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కో ఆప్షన్ సభ్యుల ఎంపిక
జిల్లా పరిషత్‌లో ఇద్దరు, మండల పరిషత్‌లో ఒకరు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను కూడా ఇదే సమావేశాల్లో ఎన్నుకోనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో నంబర్ 137 ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లతోపాటు భాషాపరమైన మైనార్టీలకు కో–ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించనున్నారు.


