8 లక్షల గాజులతో దండలు నేడు యమ ద్వితీయ నేపథ్యంలో..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక శుద్ధ విదియ (భగిని హస్త భోజనం), యమ ద్వితీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను గాజులతో విశేషంగా అలంకరించనున్నారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు అంతరాలయం, ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని అలంకరించడానికి సుమారు 8 లక్షల గాజులను సేకరించారు. అమ్మవారి ఆలయాన్ని అలంకరించేందుకు అవసరమైన గాజుల దండలను వందలాది మంది సేవా సిబ్బంది సిద్ధం చేశారు. అమ్మవారి సన్నిధిలో పూజలు అందుకున్న గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. భక్తుల రద్దీ నేపఽథ్యంలో బుధవారం ఆలయ ప్రాంగణంలో సిబ్బందికి ప్రత్యేకంగా విధులను కేటాయించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వసతులు ఏర్పాటుచేయాలని ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సిబ్బందికి సూచించారు. బుధవారం సుమారు 70 నుంచి 80 వేల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.


