వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని
చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ని గన్నవరం జెడ్పీటీసీ సభ్యుడు అనగాని రవికుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గన్నవరం జెడ్పీటీసీగా పోటీ చేసిన రవికుమార్ ఓట్ల లెక్కింపులో 63 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రీకౌంటింగ్ చేపట్టాలని కూటమి నాయకులు చేసిన పన్నాగాలను కూడా ఛేదించుకుని ఆయన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో రవికుమార్ గెలుపు చారిత్రాత్మకమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రవికుమార్ వెంట పార్టీ సీనియర్ నాయకులు తోట వెంకయ్య, గోపిశెట్టి వీరాస్వామిలు ఉన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్ చేతుల మీదుగా జెడ్పీటీసీగా గెలుపొందిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
విజయవాడలీగల్: సోనాలి రకం కోడి పిల్లలను సప్లయి చేసి, మరలా వాటిని కొని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి మోసం చేసిన కేసులో పసుపులేటి అంకుశంను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. బాధితులు తాము మోసపోయామని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితుడైన పసుపులేటి అంకుశం ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిగింది. అనంతరం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చారు.
గన్నవరం: బ్లేడ్‌తో చంపుతానని బెదిరించి విద్యార్థి వద్ద రూ. 200 నగదును బలవంతంగా లాక్కున్న ఇరువురిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన కూచిపూడి కార్తీక్ గొల్లనపల్లి జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్నేహితులు శుభోద్, సాత్విక్‌తో కలిసి పాఠశాల బయట ఉన్న సోడా బండి వద్దకు వెళ్లారు. అక్కడ గొల్లనపల్లికి చెందిన మహేష్‌తో పాటు మరో వ్యక్తి మద్యం మత్తులో కార్తీక్‌ను డబ్బులు కోసం బెదిరించారు. తన వద్ద డబ్బులు లేవని కార్తీక్ చెప్పడంతో అతని మెడపై బ్లేడ్‌తో గాయపరచడంతో పాటు చంపు తామని బెదిరించి జేబులోని రూ. 200ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో కార్తీక్ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వ్యక్తులు రావడంతో ఇరువురు పరారయ్యారు. గాయపడిన కార్తీక్‌ను చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలో సభ్యుడిగా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నూతన కమిటీని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా, కమిటీలో డాక్టర్ చంద్రశేఖర్ సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిటీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ప్రతినిధిగా చంద్రశేఖర్‌ను నియమించగా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నీతూ భగత్, నేషనల్ డెంటల్ కమిషన్ ప్రతినిధిగా డాక్టర్ ఎం. జ్యోత్స్నను ప్రభుత్వం నియమించింది. వైద్య విద్య, ఉన్నత విద్యా పరిపాలన, విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు సంబంధించిన అంశాలలో చంద్రశేఖర్‌కు విశేష అనుభవం ఉండటంతో కమిటీలో నియమించారు. ఈ నియామకం విశ్వవిద్యాలయానికి, రాష్ట్ర వైద్య విద్యారంగానికి గౌరవప్రదమైన అంశంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.
విజయవాడలీగల్: అక్రమ మద్యం కేసులో ఏ–9 నిందితుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రిమాండ్ మంగళవారం ముగిసింది. దీంతో గుంటూరు జైలు నుంచి పోలీసులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్.తేజోవతి ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు.


