కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు
వీరులపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని మాజీ శాసన సభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు పేర్కొన్నారు. మండలంలోని చట్టన్నవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు అద్దంకి కిరణ్ తన అనుచరులతో కలిసి జగన్‌మోహనరావు సమక్షంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిరణ్, చంటితో పాటు పార్టీలో చేరిన 20 కుటుంబాల వారికి పార్టీ జగన్ మోహనరావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసముందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన మంచి ప్రజలు నేటికీ మర్చిపోలేదని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్నారు. కూటమి పాలనపై ప్రజలతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మండల కన్వీనర్ ఆవుల రమేష్‌బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటేరు ముత్తారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఇప్పల కృష్ణారెడ్డి, నాయకులు చలమల దుర్గయ్య, జంగా కోటిరెడ్డి, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు అండగా కేడీసీసీ బ్యాంకు మంగళవారం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబునాయుడుకు విరాళంగా అందజేసింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుతో కలిసి చైర్మన్ రఘురాం ఈ చెక్కును అందజేశారు. అనంతరం చైర్మన్ రఘురాం మాట్లాడుతూ రైతు సంక్షేమమే కేడీసీసీబీ ప్రధాన ధ్యేయమని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలవడం సహకార బ్యాంకు సామాజిక బాధ్యతగా తీసుకున్నామన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వంతో పాటు సహకార రంగం బాధ్యతగా ముందుకు రావాలనే నిర్ణయంతో చెక్కును అందజేశామన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, బ్యాంకు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం, బీఎస్‌సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ మహిళలకు 3 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఇజ్రాయేల్ నర్సింగ్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పీఎం ఏజెఏవై కార్యక్రమంలో భాగంగా ఈ నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేశామన్నారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా తొలి విడతగా 1100 మందికి శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ అనంతరం ఇజ్రాయేల్‌లో నెలకు రూ.2లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్‌లో 300మందికి శిక్షణ ఇచ్చామని, వారికి జర్మనీలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ కార్యదర్శి తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఖాతాలోని రూ.8.50 లక్షలు మాయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక ప్రాంతంలో నివసిస్తూ ప్రభాస్ కళాశాల వద్ద రైతు బజారులో కూరగాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తికి రుణం ఇప్పించి, తన ఖాతాలో సొమ్ము ఇతర అకౌంట్స్‌కు బదిలీ చేసిన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇవి.. కృష్ణలంకకు చెందిన కూరగాయల వ్యాపారి ఇంటి పక్కనే మేకల విజయలక్ష్మి నివాసం ఉంటుంది. ఒక రోజు ఆ వ్యాపారి సిబిల్ చూసిన విజయలక్ష్మి, మీ సిబిల్ బాగుంది లోన్ వస్తుంది అని నమ్మబలికింది. ‘ఒక ఆమెకు డబ్బులు కావాలి, ఆమె పేరుతో ఉన్న ఇంటిని మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు.. మీ పేరుతో రుణం తీసుకుంటారు’ అని నమ్మబలికారు. అందులో భాగంగా ఇంటి స్థలం వ్యాపారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, మళ్లీ దానిని తనఖా పెట్టించారు. అనంతరం వ్యాపారి పేరుతో యాక్సెస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించిన విజయలక్ష్మి, లోకేష్, సంపత్ అనే వాళ్లు రుణం కోసం అప్‌లై చేయించి, రూ.8.50 లక్షలు వ్యాపారి ఖాతాలో జమచేశారు. కాగా ఆ ఖాతా ఫోన్ నంబరు వ్యాపారిది కాకుండా వాళ్లది ఇచ్చి, డబ్బులు పడిన తర్వాత విడతల వారీగా విత్‌డ్రా చేశారు. కొంత కాలం తర్వాత వ్యాపారి ఈఎంఐలు చెల్లించడం లేదని బ్యాంకు నుంచి ఒత్తిడి చేస్తుండగా, వెళ్లి ఖాతా చెక్ చేయగా, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


