చల్లపల్లి: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఎదురుగా ఉన్న కూరగాయల దుకాణంలోకి దూసుకెళ్లింది. స్కూటీ అడ్డుపడి బస్సు నిలిచిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గుడివాడ నుంచి అవనిగడ్డకు వెళ్తూ చల్లపల్లి బస్టాండు లోపలికి వచ్చింది. పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వైపు ఉన్న అవుట్ గేటు నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మలుపు తిరిగే సమయంలో బస్సు స్టీరింగ్ మొరాయించటంతో అదుపుతప్పి నేరుగా ఎదురుగా ఉన్న కూరగాయల దుకాణంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో దుకాణం మూసి ఉండటంతో వ్యాపారులు, వినియోగదారులు ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. దుకాణం వద్ద నిలిపి ఉంచిన స్కూటీ బస్సు టైరుకు అడ్డుపడటంతో బస్సు ఆగింది. కూరగాయల దుకాణంపై ఉన్న ఇనుప చువ్వలు బస్సు అద్దాలను పగలగొట్టుకుని లోపలికి చొచ్చుకుపోయాయి. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి తప్పుకోవటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. 108లో అతన్ని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్కూటీ అడ్డుపడటంతో తప్పిన ప్రమాదం


