ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మురసు తుపాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించే పనులను మరింత వేగవంతంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సిబ్బందిని అడిగి బుధవారం ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ మురసు తుపాను వల్ల సర్కిల్ పరిధిలోని జిల్లాల్లో 4,246 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. వాటిలో 33 కేవీ సామర్థ్యం–793, 11 కేవీ స్తంభాలు–2198, ఎల్‌టీ–1255 స్తంభాలు ఉన్నాయని వివరించారు.
మరమ్మతు పనుల్లో
మూడు వేల మంది సిబ్బంది..
తుపాను ప్రభావం వల్ల విద్యుత్ సరఫరాలో విద్యుత్ లైన్లతో పాటుగా విద్యుత్ పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయని చెప్పారు. తుపాను కారణంగా బాపట్ల, ప్రకాశం జిల్లా, చిలకలూరి పేట ప్రాంతాల్లో 1862 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని, బుధవారం రాత్రికి 1407 గ్రామాలను విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, ఇంకా 455 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు వేగంగా జరుగుతున్నాయని పుల్లారెడ్డి చెప్పారు. సుమారు మూడు వేల మంది సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అయ్యారన్నారు. గురువారం సాయంత్రానికి తుపాను వల్ల జరిగిన నష్టంపై అంచనా వస్తుందని పేర్కొన్నారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను 1912కు తెలియజేయాల్సిందిగా పుల్లారెడ్డి కోరారు.


