11న దుర్గమ్మకు గాజుల అలంకరణ | - | Sakshi
Sakshi News home page

11న దుర్గమ్మకు గాజుల అలంకరణ

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

11న దుర్గమ్మకు గాజుల అలంకరణ 20 నుంచి భవానీ మండల దీక్షలు నేడు బ్యాంకులకు స్థానిక సెలవు దీపావళి స్టాళ్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు 11వ తేదీన గాజులతో అలంకరించనున్నారు. భగిని హస్త భోజనం(యమ ద్వితీయ)ను పురస్కరించుకుని ఏటా అమ్మవారిని గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి ప్రధాన మూలవిరాట్‌తో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని గాజులతో అలంకరిస్తారు. అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల గాజుల దండలతో ముస్తాబు చేస్తారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం అవసరమైన గాజులను పలు భక్త బృందా లు, సేవా బృందాలు దేవస్థానానికి విరాళాలుగా సమర్పిస్తున్నాయి. బుధవారం శ్రీకనకదుర్గ లలితా పారాయణ బృందానికి చెందిన పలువురు భక్తులు పెద్ద ఎత్తున గాజులను దేవస్థానానికి సమర్పించారు. అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన గాజుల దండలను 9వ తేదీ నుంచి మహామండపం ఆరో అంతస్తులో సిద్ధం చేసేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు అమ్మవారి అలంకరణకు అవసరమైన గాజులను విరాళంగా సమర్పించవచ్చని, ఉత్సవం అనంతరం అమ్మవారి ప్రసాదంగా గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

డిసెంబర్‌ 30 నుంచి

జనవరి 3 వరకు దీక్ష విరమణలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారి భవానీ దీక్షలు నవంబర్‌ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మండలం పాటు దీక్ష స్వీకరించే భక్తులు నవంబర్‌ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీకరించవచ్చు. ఇక అర్ధమండల దీక్షలు డిసెంబర్‌ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వీకరించవచ్చు. అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం డిసెంబర్‌ 24వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది. ఇక దీక్ష విరమణలు ఈ ఏడాది 5 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది.

డిసెంబర్‌ 30వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయి. డిసెంబర్‌ 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు మహా మండపం దిగువన హోమగుండాలలో అగ్నిప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణలు ప్రారంభమవుతాయి. జనవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించే మహా పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పటమట(విజయవాడతూర్పు): దీపావళి సందర్భంగా వీఎంసీ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దీపావళి మందుగుండు సామగ్రిని విక్రయ స్టాల్‌ ఏర్పాటు చేసుకునేందుకు విక్రయదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వీఎంసీ ఏస్టేట్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాణసంచా విక్రయ స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చామన్నారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో ఈ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఒకటి లేబర్‌కాలనీ, సితార సెంటర్‌ వద్ద, రెండో అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ స్టాళ్లకు దరఖాస్తు రుసుము, జీఎస్టీ కలిపి ఒక్కో స్టాలుకు రూ.29,500 చెల్లించాలన్నారు. దరఖాస్తులు సత్యనారాయనపురంలోని సర్కిల్‌–2 కార్యాలయంలోని ఎస్టేట్స్‌ విభాగంలో తీసుకొని, అక్కడే సమర్పించాలన్నారు. పరిశీలన అనంతరం 6వ తేదీన మధ్యాహ్నం దరఖాస్తుదారులకు స్టాల్స్‌ కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement