బుడమేరుకు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం అర్నబ్ గాయం నుంచి తేరుకోకుండానే మురసు ముంచేసిన వైనం ఎన్యూమరేషన్ ఊసే లేదు అన్నదాతలను గాలికొదిలేస్తున్న కూటమి సర్కారు
తిరువూరు మండలం మునుకుళ్ల వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు
అనిగండ్లపాడు వద్ద
నేలవాలిన వరి పైరు
జి.కొండూరు: తుపాను ప్రభావంతో పలు వాగు లు పొంగి పొర్లడంతో మంగళవారం సాయంత్రం నుంచి బుడమేరుకు ప్రారంభమైన వరద ప్రవాహం బుధవారం ఉదయానికి ఉద్ధృతమైంది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుధవారం సాయంత్రానికి 5.3అడుగుల మేర నీటి మట్టం ఉండగా డైవర్షన్ కెనాల్ ద్వారా 4,300క్యూసెక్కులు కృష్ణానదిలోకి వెళ్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ తెలిపారు.
నిరంతర పర్యవేక్షణ..
వర్షాలు పడే అవకాశం ఉన్నందున బుడమేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌ను స్థానిక తహసీల్దార్ రిబ్కారాణితో కలిసి కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఉదయం పరిశీలించారు. అనంతరం హెచ్.ముత్యాలంపాడు వద్ద బుడమేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బుడమేరులో వరద కృష్ణా నదిలోకి వెళ్తున్నందున దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందనవసరం లేదన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మురసు తుపాను రైతుల ఆశలను ఛిద్రం చేసింది. గత నెల చివరిలో వచ్చిన అర్నబ్ నష్టాల నుంచి రైతన్నలు తేరుకోకముందే మళ్లీ కోలుకోలేని దెబ్బ పడింది. ఈ ఏడాది మొదట్లో నీరు లేక పంటను పండించుకోవడం కోసం రైతులు ఆయిల్ మోటార్లు పెట్టుకుని మరీ నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పు డు పంట చేతికి వస్తుందన్న తరుణంలో వెంట వెంటనే వచ్చిన తుపాన్లు రైతన్న నడ్డి విరిచాయి.
కృష్ణా జిల్లాలో..
కృష్ణాజిల్లాలో 325 గ్రామాల్లోని 32,415 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 24,523 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 23,648 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. మినుములు 486హెక్టార్లలో, వేరుశనగ 123హెక్టార్లలో, 2.5హెక్టార్లలో నువ్వులు, 208 హెక్టార్లలో పత్తి, 51 హెక్టార్లలో చెరకు, పెసరపంట నాలుగు హెక్టార్లలో దెబ్బతింది. నందివాడ, గుడ్లవల్లేరు, ఉయ్యూరు, బంటుమిల్లి, చల్లపల్లి, పామర్రు, మచిలీపట్నం సౌత్, కంకిపాడు, పెదపారుపూడి, గూడూరు, గన్నవరం, పమిడిముక్కల, ఉంగుటూరు, కోడూరు, మోపిదేవి, మొవ్వ, ఘంటసాల, పెడన మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లాలో 8,151హెక్టార్లలో వరి పంట, 76 హెక్టార్లలో జొన్న, 21హెక్టార్లలో మొక్కజొన్న, 136 హెక్టర్లలో కందులు, 496హెక్టార్లలో మినుములు, 631హెక్టార్లలో శనగ పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా మొత్తం మీద 9,511 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఒకటి తర్వాత మరొకటి..
ఇటీవల సంభవించిన అర్నబ్ తుపాను ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరి, కొబ్బరి, అరటి పంటలతో పాటు ఆక్వా రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ నష్టాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు ఇప్పుడు మురసు తుపాను మరో పెద్ద సవాలుగా మారింది. ఈ తుపానుతో కోత దశలో ఉన్న వరి పంటకు పొలాల్లో నీరు నిలవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పూత, కాయ దశలో ఉన్న పత్తిపంటకు వర్షాలు, గాలుల వల్ల నష్టం ఏర్పడింది. కంది పంట ఎదుగుదల, కాయ దశలో ఉన్నందున ఈ వర్షం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈదురు గాలులకు అరటి పంటలు నేలపై పడి పోయి తీవ్ర నష్టం కలిగింది.
సర్వే లేదు.. సాయం లేదు..
అర్నబ్ తుపాను దెబ్బకు కృష్ణాజిల్లాలో 34,864 హెక్టార్లలో వరి, 358హెక్టార్లలో మినుము, 23 హెక్టార్లలో వేరుశనగ, మూడు హెక్టార్లలో నువ్వులు, 25హెక్టార్లలో చెరుకు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. ఎన్టీఆర్ జిల్లాలో మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. పెనమలూరు పరిధిలో 300 ఎకరాల్లో అరటిపంట నేలకొరిగింది. కంద పంటకు కూడా నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో మినుము, పెసర పంటలు నేలకొరిగాయి. ఉద్యాన పంటలు అరటి 640హెక్టార్లు, బొప్పాయి 76హెక్టార్లు, కొబ్బరి 4హెక్టార్లు, ఆయిల్‌పామ్ 3 హెక్టార్లు, టమాటా 4 హెక్టార్లు, కూరగాయ పంటలు 299 హెక్టార్లు, పండు మిర్చి 19 హెక్టార్లు, పసుపు 264హెక్టార్లు, పువ్వులు 26 హెక్టార్లు, తమలపాకు 15 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాలు రూపొందించారు. అయితే ఇప్పటివరకూ ఎన్యూమరేషన్ పూర్తి చేయడం గాని రైతులకు నష్టపరిహారం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటికై నా తమను ఆదుకోకపోతే రోడ్డున పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


