దమ్ముగా ఎన్నికల్లో పోటీ పడ్డాం 2029లో జగనన్న సీఎం కావడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తాం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికార బలం, బెదిరింపులకు భయపడకుండా, దమ్ముగా, ధైర్యంగా నగర పాలక సంస్థ ఎన్నికల్లో నిలిచామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఇక మీదట ప్రజల పక్షాన నిలిచి కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలపై మరింతగా పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ లోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధికారంలో ఉన్న పార్టీలకు భయపడకుండా ముందుకు వెళ్లారన్నారు. బైండోవర్ కేసులతో తమ నేతలని ఇబ్బంది పెట్టి.. స్టేషన్లో పెట్టినా ఎక్కడ తగ్గలేదన్నారు. అంతేకాదు కౌంటింగ్ సమయంలో కూడా రీకౌంటింగ్‌లు పెట్టి మరీ కూటమి అభ్యర్థులు గెలిచారని మండిపడ్డారు. తమ అభ్యర్థులను ఎంత ఇబ్బంది పెట్టినా దమ్ముగా గెలిచి చూపించారన్నారు.
ప్రజలకు అండగా నిలుద్దాం..
రాబోయే రోజుల్లో విజయవాడలో ప్రజలకు అండగా నిలబడి మంచి చేస్తామని ఆవినాష్ పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టినా, సమస్యలు పరిష్కరించకపోయిన పోరాటం చేస్తామన్నారు. అధికార పక్షం వారు డబ్బు, పవర్ చూపించి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. అన్నింటినీ ఎదుర్కొని తమ అభ్యర్థులు నైతికంగా గెలిచారన్నారు.
లక్ష్యం ఒకటే..
రాష్ట్రంలో రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అవినాష్ అన్నారు. ఇప్పటికై నా మాట నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలన్నారు. నగరంలోని 86వ డివిజన్‌లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. రానున్న 2029 ఎన్నిల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ అభ్యర్థులకు అండా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


