ఇక పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

ఇక పరిషత్‌ పోరు

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలకు 74 మంది పోటీ 343 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 774 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్న 9,98,055 మంది ఓటర్లు

నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలకు, 343 ఎంపీటీసీ స్థానాలకు 1,266 పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లాలో మొత్తం 352 ఎంపీటీసీ స్థానాలు ఉండగా తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావటంతో 343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 26 జెడ్పీటీసీ స్థానాలకు 74 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉండగా 343 ఎంపీటీసీ స్థానాలకు 774 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 9,98,055 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్‌ సామగ్రి పంపిణీ..

జిల్లాలోని 26 జెడ్పీటీసీ స్థానాలకు 343 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల నుంచి సిబ్బందిని పోలింగ్‌ స్టేషన్లకు వాహనాల ద్వారా తరలించారు. నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ డీకే బాలాజీ పర్యవేక్షించి, ఎన్నికల సిబ్బందికి ఏ విధంగా పోలింగ్‌ సరళి నిర్వహించాలో సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.

సమస్యాత్మక,

అత్యంత సమస్యాత్మక బూత్‌లు..

జిల్లాలోని 1,266 పోలింగ్‌ బూత్‌లలో 636 పోలింగ్‌ బూత్‌లు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, క్రిటికల్‌ పోలింగ్‌ బూత్‌లుగా గుర్తించారు. ఈ పోలింగ్‌ బూత్‌లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలో 230 అత్యంత సమస్యాత్మకం, 401 సమస్యాత్మకం, 5 క్రిటికల్‌ పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి.

సిబ్బంది నియామకం..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,266 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ అధికారులు, అదనపు పోలింగ్‌ అధికారులను 6,245 మందిని నియమించారు.

వీరు కాక జోనల్‌, రూట్‌ ఆఫీసర్లను నియమించారు. పటిష్ట పోలీస్‌ బందోబస్తు కోసం 1703 మందిని నియమించారు. వీరిలో ఇరువురు ఏఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, సీఐ, ఆర్‌ఐలు 36, ఎస్‌ఐలు 94 మంది నియమించినట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలిపారు. ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు 409, కానిస్టేబుళ్లు 923, హోంగార్డులు 410, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 123, వీరు కాక మహిళా పోలీసులు 357తో పాటు రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్లు, మాజీ సైనికులను 32 మందిని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement