చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల విధులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తించాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్, జిల్లా సాధారణ పరిశీలకులు కేవీఎన్ చక్రధరబాబు అన్నారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్నికల వ్యయ పరిశీలకులు కేవీ శ్రీకాంత్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలు, నోడల్ అధికారులకు కేటాయించిన విధులు, బాధ్యతలను వివరించారు. పరిశీలకులు చక్రధరరావు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడాలని పక్షపాతానికి తావులేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. మోడల్ ఆఫ్ కండక్ట్ అమలును పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ బృందాలు సమర్థంగా ఏర్పాటు చేయాలని, నిబంధనల ప్రకారం వారికి కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ నిబంధనల ఉల్లంఘనను అరికట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, డీఆర్వో కె. శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి, డీపీవో ఎం. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


