మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 51వ సబ్–జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం జరిగిన నాకౌట్ రౌండ్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. శనివారం సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ పోటీలు జరుగుతాయి.
బాలికల క్వార్టర్–ఫైనల్స్ ఫలితాలు..
కర్ణాటక జట్టు 62–49 తేడాతో కేరళను ఓడించింది. ఇందులో ఆరుషి ఆనంద్ 17 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసి అందరిని ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టు 68–57 తేడాతో మధ్యప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. తేజస్వి కర్హానా 21 పాయింట్లు సాధించి తమ జట్టును సెమీ–ఫైనల్స్‌కు చేర్చింది.
బాలుర క్వార్టర్–ఫైనల్స్ ఫలితాలు..
ఉత్తరప్రదేశ్ జట్టు 65–40 తేడాతో కర్ణాటకను చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. హర్యానా జట్టు 70–65 తేడాతో ఢిల్లీ జట్టుతో పోటీ పడిన తీరు అందరిలో ఉత్కంఠను రేపింది. చివరకు హర్యానా జట్టు విజయాన్ని వరిచింది.
భవానీపురం(విజయవాడపశ్చిమ): హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. భవానీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన దేవిశెట్టి అనిల్ కుమార్ హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని మేనత్త కొడుకు నీరుకొండ చంటి హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ సొంత పనులపై పది రోజుల క్రితం రామచంద్రాపురం వచ్చి పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఈ నెల ఒకటవ తేదీ పల్సర్ బైక్ రాత్రి 7 గంటలకు బయలుదేరారు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్ నుంచి ఫీడర్ రోడ్‌లోకి వచ్చేసరికి ముందు ట్రాలీ లారీ చీకట్లో నిలిపి ఉంది. బైక్ డ్రైవ్ చేస్తున్న చంటి చీకట్లో ఉన్న ట్రాలీ లారీని గమనించకపోవడంతో ఢీకొట్టాడు. దీంతో చంటి కుడి కంటి కింద భాగాన బలమైన గాయం తగిలింది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వచ్చి చంటిని ఎక్కించుకుని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిల్‌లో చేర్పించారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులకు బాధిత యువకులు జరిగింది వివరించగా కేసు నమోదు చేశారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రెయిన్‌లోపడి చనిపోయిన ఘటన విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న నూతక్కి క్రాంతి కుమార్ గిల్లపూడి మైలురాయి సెంటర్‌లో ఆర్‌సీఎమ్ చర్చి దగ్గర నివసిస్తున్నాడు. అతని సోదరుడు నూతక్కి కోటేశ్వరరావు (48) అవివాహితుడు. ఆరోగ్యం బాగుండకపోవడంతో మానసిక వైద్యుడికి చూపించగా మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది. మందులు వాడటం మానేస్తే మానసిక స్థితి సరిగా ఉండదు. క్రాంతికుమార్ ఇంటి దగ్గర ఉండే టీడీపీ ఆఫీస్ వద్ద ఉంటూ అక్కడే పడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి అతని ఆరోగ్యం క్షీణించగా ఒక ప్రయివేట్ హాస్పటల్‌కి తీసుకెళ్లి మందులిప్పించారు. మర్నాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నెల ఒకటిన ఉదయం 6 గంటలకు క్రాంతికుమార్ స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో కోయపేట వెళ్లి వెతికినా కనిపించలేదు. శుక్రవారం తెల్లవారు జామున 5.45 గంటలకు పంటకాలువ రోడ్‌లో కోయపేట వద్దగల డ్రెయినేజిలో పడిపోయి ఉండటాన్ని క్రాంతికుమార్ గమనించాడు. మానసిక పరిస్థితి బాగోలేక కోటేశ్వరరావు డ్రెయిన్‌లో పడిపోయి చనిపోయి ఉంటాడని క్రాంతికుమార్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


