లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఏపీ పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో శుక్రవారం గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీజీవోస్ హోమ్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. దీన్ని విద్యాసాగర్ ప్రాంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చేసి సమాజానికి విలువైన సేవ అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పేపర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.లక్ష్మీ కాంతరావు కార్యదర్శి మఫత్ లాల్ జైన్, ఉపాధ్యక్షుడు కె. నాగేశ్వరరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, వైస్ చైర్మన్ వెలగా జోషి పాల్గొన్నారు.
బిల్లుల సబ్మిట్‌కు ‘నిధి’లో అవకాశమివ్వాలి
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
కృష్ణలంక(విజయవాడతూర్పు): పెండింగ్ డీఏ ఎరియర్స్ బిల్లులు సబ్మిట్ చేసేందుకు నిధి పోర్టల్‌లో అవకాశం ఇవ్వాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో శుక్రవారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 జూలై నుంచి 2026 వరకు విడుదల చేసిన డీఏల ఎరియర్ బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్‌ఎంఎస్‌లో టైల్స్ ఓపెన్ చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులు, రిటైరైనవారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సీఎఫ్‌ఎంఎస్ టైల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఎన్‌క్యాష్‌మెంట్ ఎర్న్ లీవు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లింపునకు కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, కె.సురేష్‌కుమార్, ఎ.ఎస్.కుసుమ కుమారి, కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, ఎస్.మురళీమోహనరావు, మనోహర్, ఎస్.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల్లో బస్సుల నిర్వహణకు విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో అమ్మవారి భక్తుల కోసం అవసరమైన బస్సుల నిర్వహణకు విజయవాడకు చెందిన భక్తులు రూ. 2.50 లక్షల విరాళాన్ని అందజేశారు. విజయవాడ గాయత్రీనగర్‌కు చెందిన అట్లూరి పల్లవి కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి ఉత్సవాల్లో దేవస్థాన బస్సులు తిరిగేందుకు అవసరమైన మరమ్మతులను చేయాలని కోరుతూ రూ. 2.50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.


