అంతా పచ్చ మేనేజ్‌మెంట్‌! | - | Sakshi
Sakshi News home page

అంతా పచ్చ మేనేజ్‌మెంట్‌!

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

రాజకీయ జోక్యం తట్టుకోలేక..

స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల్లో

తెలుగు తమ్ముళ్ల హడావుడి

వేరే వారిని రాకుండా అడ్డుకున్న వైనం

జిల్లాలో 905 ప్రభుత్వ పాఠశాలలు

892 పాఠశాలలకు ఎంపికై న కమిటీలు

మిగిలిన వాటికి కోరం లేక వాయిదా

జిల్లాలోని చాలా మండలాల్లో రాజకీయ జోక్యం అధికమవ్వటంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రధానంగా కొంతమంది టీడీపీ నేతలు తమ పిల్లలు పాఠశాలల్లో లేకున్నా తాము కమిటీలో ఉండాలంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది.

చాలా కమిటీలకు సంబంధించి పేర్లను టీడీపీ నేతలే నిర్ణయించి ఆమోదింపజేసినట్లుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు.

కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన ప్రచారం చేయకపోవటంతో తల్లిదండ్రులు పాఠశాలలకు రాలేదు.

జగ్గయ్యపేట మండలం గౌరవరం జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాల కమిటీ ఎన్నికలు టీడీపీ నాయకులు ఆధిపత్యం ప్రదర్శించడంతో ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. ముక్త్యాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో మహిళలకు కనీసం కమిటీలో ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలో మంగళవారం జరిగిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలన్నీ పచ్చ నేతల సారధ్యంలోనే కొనసాగాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో సగానికి పైగా ప్రభుత్వ బడుల కమిటీలకు సంబంధించి తెలుగు తమ్ముళ్లు హడావుడి చేస్తూ కనిపించారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీలలో రాజకీయ జోక్యం ఉండకూడదనే స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న చోట నేతలు తమ ప్రాభల్యాన్ని చాటుకోవటానికి నానా తంటాలు పడ్డారు. మాది ప్రభుత్వం మేమే ఉండాలంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికలలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.

జిల్లాలో 905 ప్రభుత్వ బడులు..

ఎన్టీఆర్‌ జిల్లాలో 20 మండలాలు కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో ప్రభుత్వ నివేదికల ప్రకారం 905 సర్కార్‌ బడులు పని చేస్తున్నాయి. అందులో మంగళవారం 892 పాఠశాలలకు స్కూల్‌ మేనేజమెంట్‌ కమిటీల ఎన్నికలను పూర్తి చేసినట్లుగా ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులకు నివేదికలను అందించారు. వారి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమాచారాన్ని చేరవేశారు. జిల్లాలో సుమారుగా 13 పాఠశాలలకు సరైన కోరం లేకపోవటంతో వాయిదా పడినట్లు అధికారులు చెబుతున్నారు.

కమిటీల సంఖ్య గరిష్టంగా 25 మంది

స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలో సభ్యుల సంఖ్య విద్యార్థుల సంఖ్యను బట్టి నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య వంద వరకూ ఉన్న విద్యాసంస్థలకు 12 నుంచి 15 మంది, వంద నుంచి 500 మంది వరకూ ఉన్న విద్యాసంస్థలకు 15 నుంచి 20 మంది, అంతకన్నా అధికంగా ఉన్న విద్యాసంస్థలకు 20 నుంచి 25 మంది కమిటీ సభ్యులు ఉండవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. కమిటీల్లో 75 శాతం సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement