100 ఎకరాల్లో పంట నష్టం
ఎ.కొండూరు: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన రెండు రోజుల వర్షానికి బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందే సమయంలో వర్షం కురవడంతో సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన బొబ్బాయి తోటలు, కాయలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ .70వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు నష్టాల పాలయ్యామని వాపోయారు. సోమవారం ఉద్యాన శాఖ అధికారి వాసవి సౌజన్య దెబ్బతిన్న పంటను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటనష్టాన్ని అంచనావేసి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తగిన పరిహారం అందించి తమను ఆదుకోవాలని, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని రామచంద్రాపురం రైతులు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గెలుస్తామనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో క్రీడాకారులు మైదానంలో అడుగుపెట్టాలని.. అప్పుడే విజయాలు సొంతం చేసుకోగలరని బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, తమిళనాడు రాష్ట్ర పీడబ్ల్యూడీ, క్రీడా శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ చెప్పారు. స్థానిక పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ఆవరణలో 51వ సబ్ జూనియర్(అండర్–13) నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువత క్రీడలను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పారు.
క్రీడల్లోనూ ఆసక్తి చూపాలి...
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడలపై కూడా ఆసక్తి చూపాలన్నారు. బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ టి.చెంగల్‌రాయుడు, ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుందని, వివిధ రాష్ట్రాల నుంచి 54 బాల బాలికల జట్లు పోటీ పడనున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్‌సీ బోస్ మాట్లాడుతూ పటమటలోని స్టెల్లా కళాశాల ఆడిటోరియం, చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం, కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భవానీపురం పున్నమీ ఘాట్‌లో అక్టోబర్ 8 నుంచి నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా కార్యక్రమాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అఽధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి వారికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్టమైన కార్యాచరణతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ నిర్మల గ్లోరి తదితరులు పాల్గొన్నారు.


