రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చారు మాథుర్ సోమవారం విజయవాడ డివిజన్‌లోని వెల్ఫేర్ యూనిట్‌లను సందర్శించారు. ముందుగా విజయవాడ డివిజన్ వర్షా సొనాకియాతో కలసి ఈ–వరల్డ్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలు ఉండే ‘ఆశా కిరణ్’ను సందర్శించి అక్కడి వారితో ముచ్చటించారు. పిల్లల్లో నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, స్వయం సమృద్ధిని పెంపొందించే దిశగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్‌లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం విజయవాడ డివిజన్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.


