ఇంధన పొదుపు ఎక్కడ?
సీఎం సభ కోసం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలిన 348 బస్సులు
బస్సులు లేక బస్టాండ్‌ల వద్ద ప్రయాణికుల పడిగాపులు
రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లా ప్రజలకు తప్పని ఇబ్బందులు
ఆర్టీసీ అధికారులు, చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల సహనంతో ఆటలు ఆడుతున్నాయి. బస్సు సర్వీసులను అర్ధంతరంగా రద్దు చేసి సీఎం సభలకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మూలన ముఖ్యమంత్రి సభ పెట్టినా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి అక్కడికి ఒక రోజు ముందు గానే బస్సులను తరలిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు రెండు రోజుల పాటు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు రద్దయిన విషయం తెలియని ప్రయాణికులు బస్టాండ్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
రోజు ముందుగానే తరలిన బస్సులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళ వారం పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు డిపోల నుంచి బస్సులను తరలించారు. విజయవాడ గవర్నర్ పేట –1, 2 డిపోల నుంచి 60 చొప్పున 120 బస్సులు, ఇబ్రహీంపట్నం డిపో నుంచి 50 బస్సులు, తిరువూరు డిపో నుంచి 25, జగ్గయ్యపేట డిపో నుంచి 18, విజయవాడ డిపో నుంచి ఐదు సూపర్ లగ్జరీ బస్సులు తరలించారు. కృష్ణా జిల్లాలోని ఐదు డిపోల నుంచి మొత్తం 130 బస్సులు తరలివెళ్లాయి. మచిలీపట్నం డిపో నుంచి 24, అవనిగడ్డ నుంచి 26, ఉయ్యూరు 35, గన్నవరం 30, గుడివాడ 15 బస్సులను నెల్లూరు జిల్లాకు మళ్లించారు.
ప్రయాణికుల పడిగాపులు
విజయవాడ గవర్నర్‌పేట రెండు డిపోల నుంచి ఆటోనగర్, నున్న, సింగ్‌నగర్, కాలేశ్వరరావు మార్కెట్, చిట్టినగర్, భవానీపురం, కబేళ, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రధానంగా ఆటోనగర్‌కు ఉపాధి నిమిత్తం ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వెళ్లే వేల మంది బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు బస్సులు రావన్న విషయం తెలియక గంటల పాటు బస్టాండ్‌లు, బస్టాప్‌ల వద్ద పడిగాపులు పడి, చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా కొందరు ఆటోవాలాలు అధిక చార్జీలు వసూలు చేశారు. ఇబ్రహీం పట్నం, తిరువూరు నుంచి విజయవాడకు ఉపాధి నిమిత్తం వచ్చేవారు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు.
సిటీ టెర్మినల్‌లో నరకం
ముఖ్యమంత్రి హాజరయ్యే ఏ కార్యక్రమం, ఎక్కడ జరిగినా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బస్సులను తరలిస్తున్నారని, ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళా ప్రయాణికులు వాపోయారు. సోమవారం విజయవాడ బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు లేవన్న సంగతి తెలియక మహిళలు, చంటి పిల్లలు ఉన్న మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సిటీ టెర్మినల్‌కు బస్సులు రావన్న సంగతి తెలియక ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు ఎండవేడికి, షెల్టర్ కింద నిలబడలేక నరకం చూశారు. రెండురోజుల పాటు పని దినాల్లో బస్సులు లేకుండా చేయడం ఏమిటని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు ఆర్టీసీ డిపోలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మరో వైపు ఇరాన్ – అమెరికా దేశాల మధ్య యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలని పాలకులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏ విషయమైనా సరే ప్రజలకు సలహాలు ఇస్తుందే కానీ పాటించదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీ్త్ర శక్తి పథకం ద్వారా వరుస నష్టాలు వాటిల్లుతున్నా, నెట్టుకొస్తున్న ఆర్టీసీని మరింత బలహీన పరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బస్సులు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లడానికి.. అక్కడ జనాలను తరలించి.. మళ్లీ విజయవాడకు రావడానికి 348 బస్సులకు వేల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆర్భాటాల కోసం ఈ భారం అంతా ప్రజలపై మోపుతున్నారు.


