ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యం ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మహా మండపం నాల్గో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ జి.ఇలక్కియ పాల్గొన్నారు.
25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఉత్స వాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఘాట్‌రోడ్డులో క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, హోల్డింగ్ పాయింట్లు, దర్శన మార్గాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు క్యూలైన్లలో మంచినీటి వసతి, సేద తీరేందుకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ ఏడాది హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులకు ఏ సమయానికి దర్శనం అవుతుందనే విషయాన్ని ఏఐ టెక్నాలజీతో ఎల్‌ఈడీ స్కీన్‌లపై డిస్‌ప్లే చేస్తామని ప్రకటించారు. భక్తులకు విశాల అన్నదాన భవనం అందుబాటులోకి వచ్చిందని, 60 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తామని వివరించారు. దసరా ఉత్సవాల్లో ఇప్పటికే పరోక్ష సేవల టికెట్లు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే ప్రత్యేక్ష సేవలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. నూతన పూజా మండ పంలో ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, చండీహోమం, ప్రత్యేక ఆకర్షణగా ఆది దంపతుల నగరోత్సవం జరుగుతాయని వివరించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ రహితంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. ఉత్సవాల్లో శానిటేషన్ కోసం సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వహిస్తారని, కీలక ప్రాంతాల్లో టాయిలెట్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసేలా విధులు కేటాయిస్తామన్నారు. ఘాట్‌రోడ్డు, క్యూలైన్లతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
ఆలయ ప్రాంగణంలో కీలక మార్పులు
దసరా ఉత్సవాల్లో కొన్ని కీలక మార్పులు చేయా లని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరిగినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధం లేని శాఖల సిబ్బంది కొండపైకి వచ్చి పదే పదే లోపలకు, బయటకు తిరగడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని ఈ ఏడాది అధిగమించాలని సూచించారు. ఈ సమావేశంలో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్, ఏడీసీపీ రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, కార్పొరేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
–
–
ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్


