సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

● కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ ● పీజీఆర్‌ఎస్‌లో 142 అర్జీలు స్వీకరణ

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. జేసీతో పాటు డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ సాయిబాబు, బందరు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్‌ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సమస్య స్వభావాన్ని బట్టి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జేసీ అధికారులకు సూచించారు. 142 అర్జీలను అధికారులు స్వీకరించారు.

ముఖ్యమైన అర్జీలు ఇవీ..

● జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఎన్‌.సత్యనారాయణ పేర్కొన్నారు. సంక కర్రలు, హియరింగ్‌ ఎయిడ్స్‌, ఎంఆర్‌ కిట్లు తదితర ఉపకరణాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చి అర్హులకు అందజేయాలని జేసీకి అర్జీ ఇచ్చారు.

● తన కుటుంబం నివసిస్తున్న పూరిగుడిసైపె మూడు నెలల క్రితం పంచాయతీకి చెందిన తాటిచెట్టు విరిగి పడటంతో ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైందని, పంచాయతీ అధికారులు స్థలాన్ని పరిశీలించి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు అందలేదని చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కర్ర వెంకటరత్నం ఫిర్యాదు చేశారు. త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement