మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

ఎయిర్‌పోర్ట్‌ బాధితుల సమస్యలను పరిష్కరించాలి

గన్నవరం: విమానాశ్రయ విస్తరణ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన యజమానుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులతో మండలంలోని అల్లాపురంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చిరు ఉద్యోగులు, వ్యాపారులు కూడబెట్టుకున్న డబ్బు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ప్లాట్లను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. విమానాశ్రయ విస్తరణ కోసం 11 ఏళ్ల క్రితం 550 మంది నుంచి ప్లాట్లు తీసుకున్న ప్రభుత్వం ఇంతవరకు న్యాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్లాట్లు కోల్పోయిన బాధితులకు సీఆర్‌ డీఏ అనుమతితో కూడిన పూర్తి మౌలిక సదుపాయాలతో ప్లాట్లు కేటాయిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత కిసాన్‌ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరిబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తమ స్థలాలను ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం న్యాయం చేయకుండా మానసిక క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. బాధితులు న్యాయం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాట్ల యజమానులతో సమవేశమై వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్లాట్ల యజమానుల సంఘం ప్రతినిధి వేదవతి అధ్యక్షతన సామాజిక కార్యకర్త డాక్టర్‌ వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement