గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై దమనకాండ
● ఎక్కడికక్కడ అక్రమ అరెస్ట్‌లు
● అనుమతి లేదనే సాకుతో ఇష్టారాజ్యం
● మహిళలని కూడా చూడకుండా
స్టేషన్లలో రాత్రి వరకూ
నిర్బంధం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సచివాలయ ఉద్యోగుల ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. వారి పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఎక్కడ దొరికితే అక్కడ తమ వాహనాలు ఎక్కించి తరలించారు. మహిళలు అని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా నగరం చుట్టూ తిప్పుతూ చివరికి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లా లోని పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అక్కడ వారిని ఇరుకు గదుల్లో పెట్టి, మంచినీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగుల పట్ల పోలీసులు ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ప్రవర్తించారు.
ప్రభుత్వ ఆదేశాలతోనే..
నగరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొనేందుకు ప్రభుత్వ ఆదేశాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో విజయవాడలో నిరసన తెలపకూడదనే ఆదేశాలతో పోలీసులు శనివారం రాత్రి నుంచే ఆ పనిలో నిమగ్నమయ్యారు. నిద్రాహారాలు లేకుండా సచివాలయ ఉద్యోగులు బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీలు, డార్మెటరీలు ఇలా అక్కడ దొరికితే అక్కడ పట్టుకుని స్టేషన్‌లకు తరలించారు. ఒకవైపు ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు, మరోవైపు ఉద్రిక్తతతో పలువురు సచివాలయ ఉద్యోగులతో పాటు పోలీసులూ సొమ్మసిల్లారు. అంతేకాదు ఒక సీఐ గుండెపోటుతో మరణించేందుకు ప్రభుత్వ ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీళ్లు, ఆహారం ఇవ్వకుండా..
ఆదివారం వేకువ జాము నుంచే సచివాలయ ఉద్యోగులకు అరెస్టు చేస్తున్న పోలీసులు వారిని స్టేషన్‌లలో గదుల్లో బంధించారు. వారికి నీరు ఆహారం కూడా ఇవ్వలేదు. ఉక్కపోత, మరోవైపు దాహంతో అల్లాడిపోయారు. అంతేకాదు మహిళా ఉద్యోగులు టాయిలెట్స్‌కి వెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటే ఎంతగా వేధించారో అర్థం చేసుకోవచ్చు.
అనుమతి నిరాకరణతోనే..
ఏ ఉద్యమం అయినా, నిరసన అయినా అనుమతి ఇస్తే శాంతియుతంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా వివాదాలు సృష్టించేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ సీపీ డీఎస్సీ అక్రమాలపై చేపట్టిన నిరసన అయినా, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులది అయినా అనుమతి కోరితే, ఇవ్వకుండా ఉద్రిక్తతలకు దారితీసేలా ప్రభుత్వమే వ్యవహరించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
మాచవరం పీఎస్‌లో దారుణం
గుణదల(విజయవాడ తూర్పు): మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిరసనకారులకు ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామి రెడ్డి భోజన ప్యాకెట్లు అందించే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంట్రామిరెడ్డిని అడ్డుకుని తాను తెచ్చిన భోజనాన్ని సైతం అనుమతించలేదు. దీంతో ఉద్యోగులు, సంఘ నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు.


