ల్యాబ్ ఉన్నట్లే తెలీదు..
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ చొరవతో
అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
34 ప్రయోగశాలలు
● సర్కార్ బడుల్లో 18, ప్రైవేట్
విద్యాసంస్థల్లో 16 ల్యాబ్‌లు
● వాడకం లేక పనికిరాకుండా
పోతున్న పరికరాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూలనపెట్టారు. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే విజ్ఞాన శాస్త్రంలో అత్యుత్తమంగా తీర్చిదిద్ది తద్వారా నూతన ఆవిష్కరణల దిశగా వారిని నడపించాలని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి అత్యున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలు కొన్ని విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఎందుకు పనికిరాని శాలలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బాల శాస్త్రవేత్తలే లక్ష్యంగా..
కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో విద్యార్థులను విజ్ఞాన శాస్త్రాలలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. పాఠశాల విద్యార్థులను ఆ స్థాయిలోనే శాస్త్రవేత్తలుగా అడుగులు వేయించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ మిషన్ కింద 2017లో దేశంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ పేరుతో ప్రయోగశాలల ఏర్పాటకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పదో తరగతి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న పాఠశాలలను, నాణ్యమైన విద్యను అందిస్తున్న బడులను ఎంపిక చేసి ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఈ ప్రయోగశాలల ఏర్పాటుకు నాంది పలికింది. దీనికి నీతి ఆయోగ్ వంటి సంస్థ మార్గదర్శకం చేసింది. 1500 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన గదిలో దీనిని ఏర్పాటు చేసి.. దీనికి ఆ విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.
రూ.4కోట్లతో 34 ప్రయోగశాలలు..
● కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ప్రయోగశాలకు రూ.12 లక్షల చొప్పున ఖర్చు చేసి పరికరాల కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేసింది.
● తొలుత కేవలం ప్రభుత్వ బడుల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
● ఆ తరువాత దేశ వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు మంచిగా నడిచే ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
● ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 34 విద్యాసంస్థల్లో 2019 నుంచి 2024 వరకూ ఏటేటా వీటిని ఏర్పాటు చేసింది.
● ఎన్టీఆర్ జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ బడుల్లో దశలవారీగా వీటిని ఏర్పాటు చేశారు. అలాగే ఎనిమిది ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేశారు.
● కృష్ణాజిల్లాలోనూ తొమ్మిది ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మిగిలినవి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశారు.
● మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాకు రూ.2.36 కోట్లు, కృష్ణాజిల్లాకు రూ.1.64 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తుప్పు పడుతున్న పరికరాలు..
విద్యార్థుల వినియోగం లేకపోవటంతో ప్రయోగశాలలో ఉన్న కొన్ని పరికరాలు పనికిరాకుండా పోతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా ఈ ల్యాబ్‌ల ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ల విషయంలో శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన ప్రాజెక్ట్‌లు సంఖ్య, వాటి నాణ్యతను పరిశీలిస్తే ఈ ప్రయోగశాలలు ఎంతమేర వినియోగించారో తెలుస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రధానోపాధ్యాయులు చైర్మన్‌గా పని చేస్తున్న ప్రయోగశాల కమిటీ ఎన్ని సార్లు సమావేశమైంది. ఎన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయోగశాలలను పరిశీలించారు. కనీసం ఆ కమిటీలు ఏర్పాటు జరిగిందా అని పరిశీలిస్తే వాటి పరిస్థితి అర్థమవతుందని పలువురు సీనియర్ ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయులపై ఒత్తిడి మరింత పెరిగింది. బోధనా విధులేకాక అనేక పనులకు ఉపాధ్యాయులను వినియోగిస్తుండటంతో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను విద్యార్థులకు పరిచయం చేసే పని లేకుండా పోయింది. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు ఉన్న విద్యాసంస్థల్లో చాలా మంది విద్యార్ధులకు తమ విద్యాసంస్థలో ఆ విధమైన ల్యాబ్ ఉన్న విషయం సైతం తెలియలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ బడుల్లో ఉన్న ప్రయోగశాలల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొన్ని వాటిని పూర్తిగా మూలన పెట్టారని ఉపాధ్యాయులు వివరిస్తున్నారు.


