గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జెన్ జీ ఉద్యమ ప్రేరణో.. కూటమి ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలతో కడుపు మండిందో ఏమో.. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో కదం తొక్కారు. రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ ధర్నా చౌక్‌కు వేలాదిగా తరలివచ్చారు. ఒక దశలో అరెస్ట్ చేయాలని ఊగిన పోలీసులు.. వీరిని తరలించేందుకు తెచ్చిన పదుల సంఖ్యలో బస్సులు అక్కడే పెట్టి చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 600 మంది సచివాలయ ఉద్యోగులు కళ్లెదుటే చనిపోతే ప్రభుత్వం స్పందించలేదు. మంత్రి దిగివచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా చౌక్.. విజయవాడ విడిచి పెట్టేది లేదంటూ సచివాలయ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు.
తొమ్మిది గంటల పాటు నిరసన..
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల కల్లా విజయవాడ ధర్నా చౌక్, లెనిన్‌సెంటర్, బీఆర్‌టీఎస్ రోడ్డులోకి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన కొనసాగుతూనే ఉంది. ధర్నా చౌక్‌లో అడుగు పెట్టనీయకుండా పోలీసులు చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులు ఎండలో మగ్గిపోతుంటే, పోలీసులు అరెస్ట్ చేసిన వారు స్టేషన్లలో మగ్గిపోయారు. ధర్నా చౌక్‌కు చేరుకున్న వారిలో కొందరిని అరెస్ట్‌లు చేయడంతో తోపులాట జరిగింది.


