గుడ్లవల్లేరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ దుర్మరణం చెందాడు. గుడ్లవల్లేరు ఎస్.ఐ ఎన్.వి.వి.సత్యనారాయణ చెప్పిన వివరాల మేరకు.. మండలంలోని అంగలూరుకు చెందిన పేరుబోయిన శ్రీనివాసరరావు(48) ఆర్‌ఎంపీగా వైద్యం చేస్తుంటాడు. ఆయన బుధవారం తన పొలానికి సాగునీరు పెట్టేందుకు డీజిల్ కోసం ద్వి చక్రవాహనంపై గుడ్లవల్లేరుకు వచ్చారు. అంగలూరుకు తిరిగి వస్తుండగా గుడివాడ నుంచి వస్తున్న కారు టైరు పేలిపోయి శ్రీనివాసరరావు మీదకు దూసుకొచ్చింది. బలమైన గాయాలు కావటంతో పేరుబోయిన అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


