పామర్రు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లోని స్కిల్ హబ్‌లో బయోమెట్రిక్ డేటా ఆపరేటర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందించి అనంతరం కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పామర్రు, ఉయ్యూరు, పమిడిముక్కల, గుడివాడ, పెదపారుపూడి, మొవ్వ మండలాల పరిసర ప్రాంతాల యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన సర్టిఫికెట్, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం 8074370846 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పటమట(విజయవాడతూర్పు): వాహనం గుంతలో పడి అదుపు తప్పిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు మండలం పోరంకి గిరిజాపురం కాలనీకి చెందిన నిమ్మగడ్డ ధర్మేంద్ర కుమార్ (92) పోరంకి నుంచి దుగ్గిరాలకు ఎలక్ట్రికల్ మూడు చక్రాల వాహనంపై వెళ్తున్నాడు. బెంజిసర్కిల్ సమీపంలోని సర్వీస్ రోడ్డులోకి తిరుగుతుండగా అక్కడ రోడ్డుపై ఉన్న గుంతలో వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ధర్మేంద తలకు బలమైన గాయమవ్వగా స్థానికులు 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లగా ధర్మేంద్ర అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖండించిన ఏపీ క్రిస్టియన్ సొసైటీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ క్రిస్టియన్ (మైనార్టీ) సొసైటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ సభ్యుడు పాస్టర్ జి.అరుల్ అరసు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఒక మతానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారన్నారు. మరో సభ్యుడు జేమ్స్ కుంపట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హిందూ మతానికి ఎటువంటి సహాయ, సహకారాలు అందించలేదని, కేవలం క్రైస్తవ మతాన్ని మాత్రమే ప్రోత్సహించారంటూ విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి చరిత్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఆయన కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి సొంత పార్టీ పెడుతూ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్రైస్తవులపైన, క్రైస్తవ మతంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


