వరుస చోరీల నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వరుస చోరీల నిందితుడు అరెస్ట్‌

Sep 3 2026 8:35 AM | Updated on Sep 3 2026 8:35 AM

ఉంగుటూరు(గన్నవరం) షామియానా షాపు నిర్వహణ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు ఉంగుటూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి సుమారు రూ. 95 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె. ధర్మేంద్ర బుధవారం వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉంగుటూరు, లంకపల్లి, నందమూరు, కొయ్యగూరపాడు గ్రామాల్లో వరుస చోరీలు జరిగినట్లుగా చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్‌, సీసీఎస్‌ సీఐ గోవిందరాజులు నేతృత్వంలో ఉంగుటూరు పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. వివిధ సాంకేతిక పద్దతులతో పాటు బాధితుల అనుమానం మేరకు ఉంగుటూరుకు చెందిన షామియానా దుకాణానికి చెందిన ధూళిపూడి శ్యామ్‌బాబు అలియాస్‌ నానిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల గుట్టురట్టయినట్లు చెప్పారు. అతడి నుంచి 615 గ్రాముల బంగారం, 2.75 కిలోల వెండి వస్తువులు, రూ.60 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై 2014లో ఒక కేసు నమోదైనట్లు చెప్పారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఉంగుటూరు ఎస్‌ఐ యు. గోవిందు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. షామియానా షాపు నిర్వహణ వృత్తిగా, చోరీలు ప్రవృత్తిగా ఎంచుకున్న శ్యామ్‌బాబు గత ఏడు నెలలుగా వరుస చోరీలతో ప్రజలతో పాటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు.

రూ.95 లక్షల సొత్తు రికవరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement