బుసకనూ బొక్కేస్తున్నారు! పెడనలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నాయకులు పెడన: జాతీయ రహదారి నిర్మాణ పనులు, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాలకు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు, సబ్ స్టేషన్ల నిర్మాణం ఇలా ఒకటేంటి అన్నిచోట్లా భూములను మెరక చేసే పనులకు బుసకను వినియోగించనంతగా మట్టిని వినియోగించరు. అటువంటి బుసకను ‘బుసకాసురులు’ రాత్రీపగలు తేడా లేకుండా దోచుకుపోతున్నారు. అడిగే వారు, ప్రశ్నించే వారుంటే వారిని రాజకీయ ఒత్తిళ్లతో నోరు మూయిస్తున్నారు. చివరకు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా సరే ‘మా పని మాదే.. మీ పని మీదే’ అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ట్రాక్టరు బుసక(రెండు లేదా మూడు టన్నులు) రూ.1,600 నుంచి రూ.1,800 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఈ ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కారణం మట్టి దొరకని దుస్థితి ఏర్పడుతుండటంటో రూ.2వేలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని తమ్ముళ్లే పేర్కొవడం విశేషం. టిప్పరు బుసక అయితే సుమారుగా ఏడు నుంచి 8 టన్నులు వరకు కొనుగోలు చేసే వారిని బట్టి రేటు సుమారు రూ.8వేలు నుంచి రూ.10వేలు వరకు విక్రయిస్తున్నారు.
ఈ ప్రాంతాల నుంచి.. పెడన మండలంలో ఎస్వీపల్లి, నేలకొండపల్లి, దేవరపల్లి ప్రాంతాల నుంచి బుసక, మట్టి తరలిపోతోంది. రాత్రి, పగలు బుసక, మట్టి తవ్వకం, తోలకం పనులు జరుగుతున్నా చూసీచూడనట్లు అధికారులు నడుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్వీ పల్లిలో ఇటీవల పనులు జరుగుతున్నాయని తెలిసి రెవెన్యూ అధికారులు పనులను నిలుపుదల చేయించారు. రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ పనులు ప్రారంభించారు. దేవరపల్లిలో మట్టిని తోలుతూ చెరువులను తవ్వేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ పనులపై రెవెన్యూ అధికారులు చర్య లు తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది వెళ్లి ట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకుపోయారు. జేసీబీలను అలాగే వదిలేయడం పట్ల రెవెన్యూ యంత్రాంగంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లను తీసుకువెళ్లే రెవెన్యూ సిబ్బంది జేసీబీలను ఎందుకు తీసుకువెళ్లడం లేదంటూ అభ్యంతరాలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.
కాగిత వర్సెస్ బూరగడ్డ వర్గీయులు
పెడన మండలంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వర్గీయులు, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గీయులు పోటాపోటీగా రాత్రి, పగలు తేడా లేకుండా బుసకను, మట్టిని ఇతర మండలాలకు తరలించేస్తూన్నారనే విమర్శలున్నాయి. కాగిత వర్గీయులు తోలుకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారని, మేం తోలుకుంటుంటే పట్టుకోవడం ఏమిటంటూ బూరగడ్డ వర్గీయులు అధికారులతో గొడవలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
మా దృష్టికి వస్తే చర్యలు..
మండలంలో బుసక, మట్టి తోలకం పనులు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఎస్వీపల్లిలో పనులు జరుగుతున్నాయని మా దృష్టికి రాగానే సిబ్బందిని పంపించి పనులు నిలుపుదల చేయించాం. ఆ తరువాత వారు వచ్చి అనుమతులు చూపారు. ఇప్పుడు దేవరపల్లిలో పనులు జరుగుతున్నట్లు మా దృష్టికి రావడంతో వెంటనే అక్కడ ఉన్న వాహనాలను తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాం. మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.
పెడనలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నాయకులు
● ఎమ్మెల్యే కాగిత, బూరగడ్డ వర్గీయుల
మధ్య పోటాపోటీ
● వారు రెండు ట్రాక్టర్లు తొలుతే..
మేం మూడు తొలుతాం అంటూ
గుట్టలను కరిగిస్తున్న వైనం
● అధికారులు ఒక వర్గానికి కొమ్ము
కాస్తున్నారంటూ ఆగ్రహావేశాలు
● పేరుకే తనిఖీలు చేపడుతున్న
అధికారులు
– షేక్ వజీదా రహమాన్,
తహసీల్దార్, పెడన