పామర్రు: బల్లిపర్రు లాకులకు ఎగువనున్న ప్రాంతాల్లో సాగునీరు అందక పోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని లాకుల వద్ద రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. లాకులకు ఎగువ ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఉన్నాయని వీటిలో నాట్లు వేశామని కానీ సాగుకు నీరు అందని కారణంగా నాట్లు ఎండిపోతున్నాయని వారు వాపోయారు. బల్లిపర్రు లాకుల నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీరు విడుదల చేయటంతో తమ పంట పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై జల వనరుల శాఖ డీఈ సూర్య భరత్ స్పందిస్తూ రీడింగ్ ప్రకారమే సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలోనైనా, వ్యాపారంలోనైనా విజయాన్ని అందుకోవాలంటే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ప్రముఖ బాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మార్చుకుంటూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వ్యాపార, పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన బీఎన్‌ఐ ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ నెట్‌వర్కింగ్ కాంక్లేవ్ 4.0లో పుల్లెల గోపిచంద్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ), డేటా ఆధారిత నిర్ణయాలు, వినూత్న మార్కెటింగ్ పద్ధతులు వంటి ఆధునిక సాధనాలను ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించవచ్చని సూచించారు. ఒకరి అనుభవం మరొకరికి మార్గదర్శకంగా మారుతుందని, బలమైన నెట్‌వర్క్ ఉన్న వ్యాపారవేత్త ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోగలడని చెప్పారు. కార్యక్రమంలో బీఎన్‌ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో కమిటీ చైర్మన్ త్రినాథ్ నండూరి, కన్వీనర్ బి.దేవకుమార్, కార్యదర్శి లక్ష్మీశాంతి కోగంటి, కాంక్లేవ్ కమిటీ చైర్మన్ పి.యువకిషోర్, కన్వీనర్ ఎన్.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): పంచాయతీ రాజ్ ఈఎన్‌సీ నియామకంపై రగడ జరుగుతోంది. ప్రస్తుత ఈఎన్‌సీ బి.బాలునాయక్ ఈ నెలాఖారుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనంతరం ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం ఆ శాఖలో వాడీవేడి చర్చ సాగుతోంది. ఉద్యోగ విరమణ చేసినా బాలునాయక్‌కు మరో రెండేళ్లు సర్వీసు పొడిగించి, ఆయన్నే ఈఎన్‌సీగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఆ పోస్టు చేపట్టేందుకు అర్హత ఉన్న ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులు మండిపడుతున్నారు. తన సర్వీసులో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని ఉద్యోగ విరమణ చేసినా అదే పోస్టులో ఎలా కొనసాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖలో ఎస్‌ఈలు, ఈఈలు, డీఈలకు ఉద్యోగోన్నతులు కల్పించడంలో తీవ్ర జాప్యం నెలకొంది. తమకు ఉద్యోగోన్నతులు కల్పించకుండా, ఉద్యోగ విరమణ చేసే వారిని కొనసాగించేందుకు సంబంధించిన ఫైలును ఆగమేఘాలపై ఆమోదం కోసం పంపడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగ విరమణ అనంతరం బాలునాయక్ పునర్నియామకం జరిగితే ఆ ఖాళీ ఏర్పడకుండా ఉండటమే కాకుండా, సేవలో ఉన్న అర్హులైన అధికారుల, ముఖ్యంగా మహిళా అధికారుల ఉద్యోగోన్నతి అవకాశాలు మరింత కాలం వాయిదా పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మహిళా అధికారికి
అవకాశం కల్పించాలి..
ఇప్పటికే పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజను కలిసి అర్హత ఉన్న మహిళా అధికారిని ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా నియమించాలని వినతిపత్రం అందజేశారు. ఆమెకు ఇంకా పదేళ్లు సర్వీసు ఉందని ఉన్నతాధికారులు చెప్పడంపై వారు మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు, నియామక విధానాల ప్రకారం ఉద్యోగంలో చేరిన అధికారి, అదే కారణంతో తరువాత ఉన్నత పదవికి అవకాశాన్ని కోల్పోవడం న్యాయసమ్మతమేనా అని ఆ శాఖ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటిస్తున్న నేపథ్యంలో, అర్హత కలిగిన సేవలో ఉన్న మహిళా అధికారికి ఇంజినీర్–ఇన్–చీఫ్ పదవికి సముచిత అవకాశం కల్పించాలని ఆ శాఖ ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు.


