ఆర్‌అండ్‌బీలో రెగ్యులర్ ఎస్‌ఈని
తప్పించి ఇన్‌చార్జిగా వచ్చేందుకు ప్రయత్నాలు!
మంత్రుల చుట్టూ తిరుగుతూ
సిఫార్సులు చేయిస్తున్న వైనం
ఈఈపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్న ఉద్యోగులు
ఎస్‌ఈకి మరో 9 నెలల సర్వీసు ఉండగా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నలు
అనేక ఆరోపణలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్కిల్ ఆర్‌అండ్‌బీ రెగ్యులర్ ఎస్‌ఈని ఆ పోస్టు నుంచి తప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనకు ఇంకా తొమ్మిది నెలల సర్వీసు ఉన్నా, ఆ స్థానంలో ఇన్‌చార్జిగా రావడానికి నగర సమీపంలోనే పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి రాజకీయ నాయకులతో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శికి అమాత్యుల సిఫార్సు లేఖలు ఇచ్చిన ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇప్పుడు ఏకంగా సకల శాఖల మంత్రి చుట్టూ తిరుగుతూ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు ఫోన్‌లు చేయిస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమిలోని ఓ పార్టీకి చెందిన మంత్రి తన క్లాస్‌మెంట్ అంటూ ప్రచారం చేసుకుంటూ, ఎలాగైనా ఇన్‌చార్జి సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) పోస్టు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మనస్తాపం చెందిన ఎస్‌ఈ!
ప్రస్తుతం విజయవాడ సర్కిల్ ఎస్‌ఈగా పనిచేస్తున్న జి.వి.భాస్కరరావుకు మరో తొమ్మిది నెలల సర్వీసు ఉంది. రెగ్యులర్ ఎస్‌ఈ ఉద్యోగ విరమణ తర్వాత ఇన్‌చార్జిగా వచ్చేందుకు కిందిస్థాయి అధికారులు ప్రయత్నించడం సాధారణం. ఇప్పుడు నిజాయతీగా పనిచేసే ఉన్నతాధికారిని తప్పించి, ఆ పోస్టులో కిందస్థాయి ఉద్యోగి ఇన్‌చార్జిగా రావాలని ప్రయత్నించడం ఇప్పుడే చూస్తున్నా మంటూ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను సైతం ఇబ్బందులు పెట్ట కుండా సక్రమంగా విధులు నిర్వహించేలా ప్రస్తుత ఎస్‌ఈ వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాంటి తనను తప్పించి కిందిస్థాయిలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇన్‌చార్జి ఎస్‌ఈగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో ప్రస్తుత ఎస్‌ఈ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మంత్రులతో సిఫార్సులు
ప్రస్తుతం నగర సమీపంలోని డివిజన్‌లో పనిచేస్తున్న సదరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నెల రోజులుగా ఇన్‌చార్జి ఎస్‌ఈగా రావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజకీయ పలుకుబడితో పాటు, గతంలో పరిచయాలను వాడుతున్నారు. కూటమి పార్టీలోని ఒక మంత్రి తన క్లాస్‌మేట్ అని చెప్పుకుంటూ ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ కార్యదర్శితో పాటు, ఇంజినీర్ ఇన్‌ఛీప్‌కు కూడా ఫోన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. తాజాగా అన్ని శాఖలూ చూస్తున్న ఓ మంత్రి వద్దకు వెళ్లి సిఫార్సు చేయించినట్లు తెలిసింది.
ఇన్‌చార్జిగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఆ శాఖలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగుల సర్వీసు మేటర్‌లో కూడా లంచాలు ఇస్తేనే పనిచేసే నైజం అతనిది అంటున్నారు. అలాంటి వ్యక్తి రాజధాని నగరంలోని సర్కిల్‌కు ఎస్‌ఈగా వచ్చే పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు అమాత్యుల పలుకుబడి ఉందని ఉద్యోగులందరిపై తప్పుడు పనులకు వత్తిడి చేస్తే అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు.


