ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్థం పీఆర్సీ కమిషన్‌ను తక్షణం నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌కుమార్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్‌ను నియమించని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 30 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలంటే ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య. కోశాధికారి కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చెస్ ఆడితే ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం పెరుగుతాయని నెక్ట్స్‌జెన్ సీబీఎస్‌ఈ స్కూల్ సీఈవో గౌతమి చెప్పారు. స్థానిక గుణదలలోని నెక్ట్స్‌జెన్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఎన్టీఆర్ జిల్లా రాపిడ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 82 మంది పాల్గొని ప్రతిభను చూపారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్ పాషా, కార్యదర్శి పి.రేణుక, చీఫ్ ఆర్బిరేటర్లు డి.ప్రవీణ్‌కుమార్, ఎ.మణిరత్నం, నెక్ట్స్‌జెన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.సుధా విజేతలను అభినందించారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం వచ్చిన ఆదాయం రూ. 8,59,037 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ డీసీ మాట్లాడుతూ స్వామివారికి సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,47,364 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,54,355, డొనేషన్ ద్వారా రూ. 1,67,918, స్వామివారి దర్శనానికి రూ. 59,550, కళ్యాణ కట్ట ద్వారా రూ. 25,640 మొత్తం రూ. 8,59,037 ఆదాయం వచ్చినట్లు వివరించారు.
గన్నవరం: ప్రశ్నించే గొంతుకలపై డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అనుసరిస్తున్న అణచివేత ధోరణి సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. గత నెల 28వ తేదీన ఏలూరులో జరిగిన సభలో ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలను తట్టుకోలేక పవన్‌కళ్యాణ్ అక్రమ అరెస్ట్‌లకు దిగడం అన్యాయమన్నారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన రావణ్‌ను భయంకరమైన తీవ్రవాదిగా చూపిస్తూ దేశద్రోహం కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నిస్తే ఇలా భయపెడతామనే హెచ్చరికలను ప్రజలకు పంపడమే కూటమి ఉద్దేశమన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక వేదికలపై నుంచి తాట తీస్తాం, తోలు వలుస్తానని రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను వీడాలని ఆయన హితవు పలికారు. సమావేశంలో నేతలు వై. కేశవరావు, మల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


