గిరిజన సంస్కృతి సంబరం | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంస్కృతి సంబరం

Jul 6 2026 1:52 AM | Updated on Jul 6 2026 1:52 AM

గిరిజన సంస్కృతి సంబరం

భవానీపురం(విజయవాడపశ్చిమ): గిరిజన ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతూ వారి ఆత్మగౌరవాన్ని ఆకాంక్షిస్తూ శంకర్‌ షాలిని ఫౌండేషన్‌ సహకారంతో గిరిజన ప్రజా సమాఖ్య(జీపీఎస్‌), గిరిజన విద్యార్థి సమాఖ్య (జీవీఎస్‌) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం గిరిజన ఆదివాసి సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. మన్యం జిల్లా పార్వతీపురం సీతంపేట నుంచి వచ్చిన గిరిజనుల సవర నృత్యం, అదిలాబాద్‌ జిల్లా గిరిజనుల గుస్పాడి నృత్యం, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం లంబాడీలు నెత్తిమీద బిందెలు పెట్టుకుని చేసిన నృత్యం, అరకు ప్రాంతం నుంచి వచ్చిన గిరిజనుల థింసా నృత్యం, భద్రాచలం చింతూరు గిరిజనులు కొమ్మ కోయ నృత్యం ఆహూతులను కట్టిపడేశాయి. ఏపీ స్టేట్‌ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అభ్యున్నతి లక్ష్యంగా జీపీఎస్‌, జీవీఎస్‌ పని చేస్తున్నాయన్నారు. ఆధార్‌, రేషన్‌ కార్డు లేని కుటుంబాలను ఆదుకోవాలన్నారు. గాయకుడు డాక్టర్‌ కళాశ్రీ బిక్షు నాయక్‌, గాయని సుజశ్రీ వ్యాఖ్యాతలుగా వ్యహరించి అందరినీ ఉత్సాహ పరిచారు. సభలో జీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్‌, కార్యదర్శి రవి నాయక్‌, హనుమంతు నాయక్‌, మల్లు స్వామి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్‌, కృష్ణాజిల్లా అధ్యక్షుడు సమీర్‌ నాయక్‌, జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్‌, అంజు నాయక్‌, పేరం సత్యం, ధర్మ కుమార్‌, దుర్గా నాయక్‌, పార్వతి బాయ్‌, లక్ష్మణ నాయక్‌, కృష్ణా నాయక్‌, చంద్ర నాయక్‌, పాండు నాయక్‌, కాకినాడ మధుకుమార్‌, వరహాలు తదితరులు పాల్గొన్నారు.

సందడిగా గిరిజన ఆదివాసి సమ్మేళనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement