ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు వాపోయారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పౌర గ్రంథాలయ ఉద్యోగి కొలకలూరి కృపానందం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య బీమా ప్రీమియం ప్రభుత్వం మినహాయిస్తోందని, అయినా ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే హెల్త్ కార్డులు ఉపయోగపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృపానందం ఇద్దరు పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, మెడికల్ రీయింబర్స్‌మెంట్ ద్వారా ఆస్పత్రి ఖర్చులు చెల్లించాలని కోరారు. వారి కుటుంబానికి అసోసియేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


