మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నికై ంది. గాంధీనగర్‌లో సర్ విజ్జీ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారం జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయవాది కె.స్టాలిన్ రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వర రావు, ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు మహేష్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఐ.మల్లికార్జునరావు పరిశీలకులుగా హాజరయ్యారు.
నూతన కమిటీ సభ్యులు వీరే..
అసోసియేషన్ అధ్యక్షుడిగా కొంగర రవికాంత్, ఉపాధ్యక్షులుగా ఎం.ఓబుల్‌రెడ్డి, ఎల్.మేఘన, లావు సహదేవ్, కార్యదర్శిగా కొడాలి రమేష్, జాయింట్ సెక్రటరీలు ఇల్లిపిల్ల రమేష్, వల్లభనేని రాజేశ్వరి, ఎస్.వీర వెంకటసత్య నారాయణ, కోశాధికారిగా డి.శివ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
అశ్రునయనాలతో
అంత్యక్రియలు
గూడూరు: మండలంలోని పొట్టేలుగుంటాయి పేటలో శనివారం బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు మహిళలకు ఆదివారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనుమకొండ రజనీకుమారి, అనుమకొండ మధుబాల భౌతిక దేహాలకు పొట్టేలుగుంటాయిపేట లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. రజనీకుమారి చితికి ఆమె భర్త కృష్ణ, మధుబాల భౌతిక కాయానికి కుమారుడు విఖ్యాంత్ నిప్పంటించారు. తోట గౌరీదేవి భౌతిక కాయాన్ని ఆమె మెట్టినిల్లు అయిన కంకటావ శివారు కత్తులవానిపాలెం శ్మశాన వాటికలో ఆమె భర్త దేవచంద్రరావు దహనసంస్కారాలు నిర్వహించారు. అనుమకొండ మధుబాల తండ్రి బోయిడి నాంచారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం శనివారం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం జరిపించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాంచారయ్య ఫిర్యాదు మేరకు మధుబాల భర్త అనుమకొండ దేవచంద్రరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు, పెడన ఎస్‌ఐలు సీహెచ్.దివ్య ప్రకాష్, షేక్ బషీర్ పాల్గొన్నారు.
వైద్య విద్యార్థుల
భవిష్యత్తుతో ఆటలొద్దు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఏపీలో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్‌చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ తారకేష్ మాట్లాడుతూ.. ఏటా 1,500 నుంచి 2,000 మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైద్య విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దంటూ వేడుకున్నారు. మెడికల్ సీట్ల సంఖ్యను పెంచి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులు వచ్చినా సీట్లు లభిస్తుంటే, ఏపీలో మాత్రం మెరుగైన మార్కులు సాధించినా సీట్లు రాకపోవడం వెనుక ఇక్కడి కాలేజీల సంఖ్య, సీట్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె.రంగారావు, ఉపాధ్యక్షుడు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ అందె
గుంటూరు మెడికల్: పద్మశాలి వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ లోని పద్మశాలి కళ్యాణమండపం లో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అందె వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ సింగరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ టి.మునిరామ ప్రసాద్, కోశాధికారిగా నగరానికి చెందిన డాక్టర్ కొల్లి జయకిషన్‌లు ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.


