అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ‘వాడా.. ఆడో పిరికిపంద. వాడ్ని మా అన్నే రెండు మూడుసార్లు కొట్టాడు. వాడికేంట్రా భయపడేది’ అంటూ ఒక వర్గం... ‘ఏంట్రా నా గురించి ఏదో వాగుతున్నావంటా. నీ తాట తీస్తా. దమ్ముంటే రారా చూసుకుందాం’ అంటూ మరో వర్గం మధ్య పది రోజుల నుంచి చెలరేగిన మాటల యుద్ధం కొట్లాటకు దారితీసింది. ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడేలా చేసింది. అజిత్‌సింగ్‌నగర్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
పాయకాపురం ప్రశాంతినగర్ ప్రాంతానికి చెందిన కొళ్ల సూర్యతేజ(20) ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నెలలో తన స్కూల్ ఫ్రెండ్స్‌ను కలిసేందుకు సూర్యతేజ సింగ్‌నగర్ వెళ్లాడు. సూర్యతేజ వద్ద అతని ఫ్రెండ్స్ శాంతినగర్‌కు చెందిన పార్థివ్‌నందన్ అలియాస్ పార్థు ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో సూర్యతేజ ‘ఆడికేంట్రా భయపడేది. వాడ్ని మా అన్న శివ గతంలో రెండుసార్లు కొట్టాడు. ఏం చేస్తాడంటా’ అంటూ చులకనగా మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న పార్థు, సూర్యతేజకు ఫోన్ చేసి ప్రశ్నించాడు. దీంతో కొన్ని రోజుల నుంచి వారిద్దరి వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘టైం.. ప్లేస్ చెప్పరా వస్తాం’ అని సూర్యతేజ అనడంతో పార్థు తన స్నేహితులైన సన్ని, మనోజ్, రజాక్, ఈశ్వర్‌ను వెంటబెట్టుకొని శనివారం సాయంత్రం సూర్యతేజ ఇంటికి వెళ్లారు. అతడిని తమ బండిపై ఎక్కించుకొని సింగ్‌నగర్ ఎక్సెల్‌ప్లాంట్ వద్ద ఉన్న జీప్లస్‌జీ అపార్ట్‌మెంట్ల వెంబడి ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సూర్యతేజను తిట్టి, కొట్టడంతో పాటుగా పార్థు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతని కడుపులో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. సూర్యతేజ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు స్పందించి అక్క డికి రావడంతో పార్థు అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సూర్యతేజను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి అందిన సమాచారం, బాధితుది ఫిర్యాదు మేరకూ పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో పార్థు, ఎండీ రజాక్‌ను అరెస్ట్‌చేశారు. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. సూర్యతేజ స్నేహితులు పార్థు స్నేహితులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ
పది రోజులుగా మాటల యుద్ధం
ఓ యువకుడిని బైకుపై ఎత్తుకెళ్లి కత్తితో పొడిచిన ఓ గ్యాంగ్
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, మరో ముగ్గురి కోసం గాలింపు


