భవానీపురం(విజయవాడపశ్చిమ): సంఘీయులంతా సంఘటితంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీనియర్ రాజకీయ నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడ భవానీపురంలోని కొండవీడు అకాడమీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, నాయ కులు రెడ్డి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యఅతిథి వేమారెడ్డి మాట్లాడుతూ.. ఒక సామాజిక వర్గానికి సంబంధించి జిల్లాకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సరికాదని, రాష్ట్రంలో ఉన్న అందరూ కలిసి ఒక సంఘంగా ఉంటే మంచిదని సూచించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గ సంక్షేమం కోసం వారి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సంఘం డిమాండ్లను వివరించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి పాలక మండ లిని నియమించాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో రెడ్డి విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాల (హాస్టల్స్) ఏర్పాటుకు ప్రభుత్వం భూములను కేటాయించాలని కోరారు. రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బిక్క నరసింహారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం గౌరవ సలహాదారు పులుగు సుశీల రెడ్డి, ఉపాధ్యక్షురాలు త్రివేణిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెం సుబ్బారెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మచ్చ శ్రీనివాస్‌రెడ్డి, కోస్తాంధ్ర ఇన్‌చార్జ్ బోనం రామిరెడ్డి, రాష్ట్ర గౌరవ సలహాదారు జెమిలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డిని సంఘం కార్యవర్గ సభ్యులు సత్కరించారు.
ఏపీ రెడ్డి సంఘం సమావేశంలో
దొంతిరెడ్డి వేమారెడ్డి


