ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ సమీపంలోని గుంటుపల్లికి చెందిన కంచర్ల బెనర్జీ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేసింది. హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన వి.వీరప్రకాష్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించింది. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వై.యోహిత్ పేరిట కుటుంబ సభ్యులు అమ్మవారి అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వి.వి.మనుబ్రహ్మచారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళం సమర్పించారు.
ఆలయ అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇందుకూరి నరేష్‌కుమార్‌రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేసవస్త్రాలను అందించారు.


