లబ్బీపేట(విజయవాడతూర్పు): అమరావతి రాజధానిలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడి యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు కోరారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వ ర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2019లో జర్నలిస్టుల హౌసింగ్ నిర్మాణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 67 ద్వారా 30 ఎకరాల భూమిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయించిందని, ఆ భూమిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహూళ అంతస్తుల గృహ సముదాయాలను నిర్మించేలా సొసైటీ అధికారికంగా ఒప్పందం చేసుకుని తిరిగి ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిందని గుర్తుచేశారు. నాలుగు కేటగిరీల్లో జర్నలిస్టులకు అపార్ట్‌మెంట్లు నిర్మించేలా ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 107ను విడుదల చేసిందన్నారు. హ్యాపీనెస్ట్ తరహాలో జర్నలిస్టుల కోసం ఆ పార్ట్‌మెంట్లు నిర్మిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో హ్యాపీనెస్ట్‌తో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరుతున్నందున వెంటనే ప్రభుత్వం జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మొత్తం 11 తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, డైరెక్టర్లు చావా రవి, ఈశ్వర్, నరసింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి సీనియర్ జర్నలిస్టుల విజ్ఞప్తి


