మద్యం మత్తులో యువకుల వీరంగం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువకుల వీరంగం

Jul 6 2026 1:52 AM | Updated on Jul 6 2026 1:52 AM

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మద్యం మత్తులో రెండు వర్గాల యువకులు వీరంగం సృష్టించారు. వారి మధ్య జరిగి కొట్లాటలో ఒకరు గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరమేశ్వరరావు కథనం మేరకు.. మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన వడ్లమూడి చాణక్య ఆదివారం మరో ఆరుగురు స్నేహితులు కలిసి డాబాపై మందు తాగుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వేముల చందు మధ్యాహ్నం ఇంటికి రాగా ఎదురుగా డాబాపై చాణక్య అతని స్నేహితులు మద్యం మత్తులో చేస్తున్న వీరంగం చూస్తూ ఇంట్లోకి వెళ్లిపోయాడు. దీంతో చాణక్య అతని స్నేహితులు తమ డాబాపైకి కోపంగా చూస్తూ వెళుతున్నావేంట్రా అంటూ చందుతో ఘర్షణకు దిగారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. చాణక్య అతని స్నేహితులు చందుపై దాడి చేశారు. చందు భార్య జరిగిన విష యాన్ని అతని మేనమామ మణికంఠకు ఫోన్‌ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న మణికంఠ తని స్నేహితులతో కలిసి బలరామునిపేట చేరుకుని ఎందుకు దాడి చేశారంటూ చాణక్యను నిలదీశాడు. ఈ విషయంలో మణికంఠకు చాణక్య మధ్య ఘర్షణ జరిగింది. చాణక్య, అతని స్నేహితుల దాడిలో మణికంఠ చెవి తెగింది. ఆర్‌పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రెండు వర్గాల వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా కోనేరుసెంటర్‌ సమీపంలో మరలా చాణక్య అతని స్నేహితులు మణికంఠపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని రెండు వర్గాల వారిని స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాయాలపాలైన మణికంఠను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. గంజాయి మత్తులోనే తమపై దాడి చేశారని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement