కంచికచర్ల: సెలవురోజు కావడంతో సెల్‌ఫోన్ బాగు చేయించుకుందామని స్నేహితుడితో బైక్‌పై వెళ్లి తిరిగి కళాశాలకు వస్తుండగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బాలవోలు గణేష్(21), నందిగామకు చెందిన ప్రవీణ్ ఇబ్రహీంపట్నం మండలంలోని వేర్వేరు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. గణేష్ తన సెల్‌ఫోన్ బాగు చేయించుకునేందుకు ప్రవీణ్‌తోకలిసి మరో స్నేహితుడి బైక్‌పై నందిగామ వచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కళాశాలలకు తిరిగి వెళ్తుండగా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడ్‌ను ఢీకొని రెండు రోడ్ల మధ్యలో ఉన్న సాగర్‌కెనాల్‌లో పడిపోయింది. ఆ సమీపంలో పెద్ద బండరాళ్లు ఉండటంతో గణేష్, ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గణేష్ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


