మధురానగర్(విజయవాడసెంట్రల్): దావు బుచ్చయ్యకాలనీలో ఆదివారం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. ఆ వాహనం పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం నుంచి మంటలు వస్తుండటంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు ఎగశాయి. చుట్టపక్కల వారు ద్విచక్రవాహనం యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం దగ్ధమైంది. పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం సోమవారం జరుగుతుందని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అందిన ప్రతి అర్జీపై చట్టపరిఽధిలో విచారణ జరిపించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.


