42.62 శాతమే..
డిజిటలైజేషన్ అయ్యేనా.. సర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సర్ ప్రక్రియ గడువు ముగింపు సమయం ఇంకా పది రోజులే ఉంది. అయితే డిజిటలైజేషన్ చేయాల్సిన ఫారాలు ఇంకా 10 లక్షలు పైనే ఉండటంతో గడువు గుబులు సిబ్బందిని వెంటాడుతోంది. డిజిటలైజేషన్‌లో బీఎల్వోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు రాజస్తాన్‌కు చెందిన ఓ కుటుంబం ముప్పై ఏళ్లుగా విజయవాడలో నివసిస్తోంది. అద్దె ఇంట్లో ఉంటున్న ఈ కుటుంబం గత ఎన్నికల్లో గొల్లపూడిలోని ఓ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్ లో భాగంగా ఆ కుటుంబానికి బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. నాలుగైదు రోజుల్లో వచ్చి ఫారాలు వెనక్కు తీసుకుంటాం. ఈలోపు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కుటుంబానికి 2002లో రాజస్తాన్‌లో ఓట్లు ఉన్నాయి. అష్టకష్టాలు పడి అక్కడ తమ బంధువులకు ఫోన్ చేసి ఎట్టకేలకు వివరాలు సేకరించి ఫారాలు నింపి బీఎల్వోకు అందజేశారు. డిజిటలైజేషన్ సమయంలో ఫారంలో పొంది పరిచిన వివరాల ఆధారంగా వేరే వారి పేర్లు వస్తున్నాయి. దీంతో డిజిటల్ చేయ కుండా ఆపివేశారు. బీఎల్వో మళ్లీ ఆ కుటుంబం వద్దకు వచ్చి వివరాలు తెలుసుకోగా అక్కడి ఓటర్ల జాబితాలో పార్ట్ నంబరు తప్పుగా ఫారంలో పొందుపరిచినట్లు గుర్తించి సరిచేశారు. ఈ ఒక్క కుటుంబం ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడానికి బీఎల్వో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు
విజయవాడ నగరంలో రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వేలాది కుటుంబాలు స్థిరపడ్డాయి. ఇక్కడే వారికి ఓటు హక్కు కూడా వచ్చింది. వారందరినీ ఇంచుమించు ఇదే సమస్య వేధిస్తోంది. కొందరైతే ఎక్కడ తప్పులు దొర్లుతాయోనని పది రోజులు గడుస్తున్నా ఫారాలు పూర్తి చేయకుండా వారి వద్దనే ఉంచుకున్న పరిస్థితి. ఇక రాష్ట్రానికే చెందిన మహిళల్లో కొందరి పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. తెలంగాణలో పుట్టి ఇక్కడ వివాహాలు చేసుకున్న వారి వివరాల కోసం 2002 ఓటర్ల జాబితాలోకి వెళుతుంటే అప్పటి నియోజకవర్గం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగమైన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది.
వివరాల్తో తేడా వస్తే..
సీరియల్ నంబర్, అప్పటి బూత్ నంబర్, పోలింగ్ స్టేషన్ పేరు, తల్లిదండ్రులు పేర్లు ఇలా ఏ ఒక్కటి తేడా వచ్చినా మొత్తం మొదటికి వస్తుందని కొందరు బీఎల్వోలు చెబుతున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లో రాజస్తాన్, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. గవర్నర్‌పేటలోని బంగారం దుకాణాల్లో పనిచేసే పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారి వివరాల సేకరణ జాప్యమవుతోంది. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 2002 జాబితాలో పేర్లకు ఇప్పటి దానిలో పేర్లకు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు చిట్టినగర్‌కు చెందిన సయ్యద్ ముర్తుజా పేరు 2002లో సయ్యద్ మక్తిజగా నమోదై ఉంది. తండ్రి పేరు కూడా రసూల్‌కు బదులు సూల్ అని నమోదైంది. ఆ ఓటు అతనిదేనని నిరూపించుకోవాల్సి ఉంది. ఇలా ఫారాలు వెనక్కు తీసుకున్న తర్వాత తప్పులు గమనిస్తే మళ్లీ ప్రత్యేక సమయం కేటాయించాల్సి వస్తోంది. అటు బీఎల్వోలు, ఇటు ఓటర్లు సర్ పేరు చెప్పగానే భయపడిపోతున్నారు. గడువులోగా డిజిటలైజేషన్ కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికి 7,30,192 ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం ఫారాల్లో 42.62 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మిగిలిన సుమారు 10 లక్షల ఫారాలను డిజిటల్ చేయాల్సి ఉంది. ఫారాలు నింపే సమయంలో ఓటరు వివరాలు తప్పుగా నింపడం, కొందరు అసంపూర్తిగా ఇవ్వడం, ఇప్పటికీ ఫారాలు పూర్తి చేయకుండానే వారి వద్ద పెట్టుకోవడం వంటి కారణాల దృష్ట్యా డిజిటలైజేషన్ నిర్దిష్ట సమయానికి పూర్తయ్యేనా అన్న సందేహం కలుగుతోంది. అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉంటే ఒక్కో ఫారం డిజిటల్ చేయడానికి కనీసం 15 నిమిషాలు పడుతోంది.


