మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం జిల్లాలో ఇప్పటికీ అమలు కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం పథకాన్ని ప్రకటించి, నిధులు మంజూరు చేసినట్లు తెలిపినా క్షేత్రస్థాయిలో మాత్రం కిట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వేలాది మంది బాలింతలు లబ్ధికి దూరమయ్యారు.
రెండేళ్లు గడిచినా..
గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ బేబీ కిట్ పేరుతో అమలైన ఈ పథకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం మారిన తర్వాత అదే పథకాన్ని ఎన్టీఆర్ బేబీ కిట్‌గా కొనసాగిస్తామని ప్రకటించినా, రెండేళ్లు గడిచినా జిల్లాకు ఒక్క కిట్ కూడా అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పేదలపై ఆర్థిక భారం
జిల్లా వైద్యశాఖ గణాంకాల ప్రకారం 2024 నుంచి 2026 జూన్ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15,143 ప్రసవాలు నమోదయ్యాయి. ఈ బాలింతలందరికీ రూ.1,400 విలువైన బేబీ కిట్ అందాల్సి ఉన్నా, పథకం అమలు కాకపోవడంతో శిశువుకు అవసరమైన దుస్తులు, దోమతెర, న్యాప్‌కిన్లు, సబ్బులు, ఆయిల్, టవల్స్ వంటి వస్తువులను కుటుంబాలే కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.
ప్రైవేట్ వైపు మొగ్గు
మరోవైపు జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గుతుండగా, ప్రైవేట్ ఆస్పత్రుల వైపు గర్భిణుల మొగ్గు చూపుతున. పథకాల అమలులో జాప్యం కూడా ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిట్లు అందిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన ప్రతి బాలింతకు అందజేస్తామని హామీ ఇస్తున్నా, రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాలు మాత్రం ‘ప్రకటనలు కాదు... కిట్లు కావాలి’ అని కోరుతున్నాయి.


