గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పార్టీల సహకారంతో పారదర్శక ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్ వివరించారు. 17,13,445 ఓటర్లకు గాను పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, వాటి డిజిటైజేషన్ తదితరాలను వివరించారు. 2002 ఎస్‌ఐఆర్ జాబితా నుంచి ఓటరు సమాచారం పొందే విధానాన్ని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఓటర్లు ఫారాలు నింపడం, సమర్పించడంలో సహకరించేందుకు జిల్లాలోని 1,792 పోలింగ్ స్టేషన్ల పరిధిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఓటు భద్రతకే సర్ ప్రక్రియ చేపట్టామని.. అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో ఉండేలా జాబితా రూపకల్పనలో సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి.. వారి నుంచి సూచనలు స్వీకరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు పి.హరికృష్ణ (ఏఏపీ), కాకాని తరుణ్ (బీజేపీ), పి.డేనియల్ (బీఎస్‌పీ), డీవీ కృష్ణ (సీపీఎం), వై.ఆంజనేయరెడ్డి, జి.సుందర్ పాల్ (వైఎస్సార్ సీపీ) తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్‌లో కచ్చితత్వానికి పెద్దపీట
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో కచ్చితత్వానికి పెద్ద పీట వేయాలని రోల్ అబ్జర్వర్ ఐఏఎస్ అధికారి ఎం.వి. శేషగిరిబాబు సూచించారు. శనివారం సర్ కార్యక్రమం పరిశీలకులు శేషగిరి బాబు.. కలెక్టర్ లక్ష్మీశతో కలిసి ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించి.. కార్యక్రమం సజావుగా జరిగేందుకు సూచనలు చేశారు.


